Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనంగా నిలిచింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, పార్టీని, ప్రజలను నమ్ముకుని పనిచేసిన అనంతపురం జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు, బిసి వర్గానికి చెందిన దళవాయి రమాదేవిని గవర్నర్ కోటాలో శాసనమండలి అభ్యర్థిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.
దళవాయి రమాదేవి సుదీర్ఘకాలంగా అంగన్‌వాడీల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అనంతపురం జిల్లా అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలిగా వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆమె ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల పట్ల జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తూ ధైర్యంగా నిలబడ్డారు. పలు కేసులను ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు.
రాజకీయాల్లో డబ్బు, పలుకుబడి ఉన్నవారికే పదవులు దక్కుతాయనే భావనను తిరగరాస్తూ, సామాన్య వర్గానికి చెందిన అంగన్‌వాడీ నాయకురాలికి చట్టసభల్లో అవకాశం కల్పించడం ద్వారా చంద్రబాబు నాయుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా పార్టీ సేవకే అంకితమైన దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ బెర్త్ ఖరారు కావడం పట్ల ఉమ్మడి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల టీడీపీ శ్రేణులు, అంగన్‌వాడీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















