గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లను కేబినెట్ ఆమోదించింది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
Chandrababu on BC Reservations | బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

- ఏపీ కేబినెట్ బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఆమోదించింది.
- గ్రామీణంలో 34%, పట్టణంలో 33.33% రిజర్వేషన్లు; ప్రత్యక్ష ఎన్నికలు.
- ఎన్టీఆర్ మొదలుపెట్టిన బీసీ రిజర్వేషన్లను కూటమి ప్రభుత్వం పెంపొందించింది.
- స్థానిక ఎన్నికలు నిధుల కోసం అత్యవసరం; వైసీపీకి సీఎం హెచ్చరిక.
BC Reservations in AP | అమరావతి: ఏపీ కేబినెట్ భేటీలో బీసీల సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం 3 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపికను ఇకపై ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపగానే రేపు కేసులు వేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని, ఈ విషయంలో కోర్టు కేసులు వేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కొత్త జిల్లాలకు అనుగుణంగా 28 జిల్లా ప్రజాపరిషత్‌లు
శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు వెనుకబడిన వర్గాల (బీసీ) రిజర్వేషన్ల అంశంపై కీలక ప్రసంగం చేశారు. సుస్థిరమైన పాలన అందించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజనకు అనుగుణంగా 28 జిల్లా ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గతంలో పాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీసీల రిజర్వేషన్లను కాపాడలేకపోయారని, కానీ తమ కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు సంపూర్ణ అండగా నిలుస్తుందని, ఈ నిర్ణయాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది నిర్ణయాధికారంలో వారికి భాగస్వామ్యం ఇవ్వడమేనని, ఇది ఎన్డీఏ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ఇస్తున్న గౌరవమని చెప్పారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను, వ్యవసాయాన్ని, చేతివృత్తులను నిలబెట్టింది బీసీ సమాజమేనని కొనియాడారు. ఎన్డీఏ ఇచ్చిన ఎన్నికల హామీతో పాటు తమ ప్రభుత్వ రాజకీయ సిద్ధాంతంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని అసెంబ్లీ వేదికగా సీఎం ధీమా వ్యక్తం చేశారు.

బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఎన్టీఆర్ ఆనాడే భావించారు
బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ముందు, ఆ తర్వాత అనే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆనాడు టీడీపీ, నేడు కూటమి ప్రభుత్వం బీసీలను నిరంతరం ఆదుకుంటున్నాయన్నారు. ఎన్‌టీఆర్ (NTR) టీడీపీని స్థాపించిన నాడే బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని నిర్ణయించి ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, దేవేందర్ గౌడ్ వంటి నేతలను కీలక నాయకులుగా ఎదిగేలా ప్రోత్సహించారని గుర్తుచేశారు. బీసీ సంక్షేమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి పనిచేస్తున్నాయని, బీసీలకు టీడీపీకి మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. 1984లోనే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి మండల, జిల్లా ప్రజాపరిషత్‌లలో సీట్లు కేటాయించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
1972 నాటి 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్ఫూర్తి పొంది, 1995లో తాను ముఖ్యమంత్రిగా యాక్ట్-5 కింద బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలులోకి తెచ్చానని చంద్రబాబు వివరించారు. ఈ 34 శాతం కోటాతోనే 1995, 2001, 2006, 2013 స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. అయితే 2019లో గత వైఎస్సార్‌సీపీ పాలకులు జీవో 176 ద్వారా నాటకాలు ఆడి బీసీలకు ద్రోహం చేశారని విమర్శించారు. జీవో 559, 560ల ద్వారా రిజర్వేషన్లను 24.15 శాతానికి తగ్గించి సుప్రీంకోర్టులో కూడా సరిగ్గా వాదించకపోవడం వల్ల దాదాపు 16,800 మంది బీసీ నాయకుల అవకాశాలను గండికొట్టారని ఆరోపించారు.

సాధారణ ఎంపీటీసీ నేడు ఎంపీ అయ్యారు
కూటమి ప్రభుత్వం బీసీలకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా న్యాయం జరిగే వరకు కొండంత అండగా నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఒక సాధారణ ఎంపీటీసీని నేడు ఎంపీగా చేసిన ఘనత ఎన్డీఏదేనని ఉదాహరించారు. గత పాలకులు రాజకీయ విద్వేషంతో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాస్, కూన రవికుమార్ వంటి బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టారని, తోట చంద్రయ్య గొంతుపై కత్తిపెట్టారని, అలాగే కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య ప్రాణాలు పోగొట్టుకున్నా సిద్ధాంతాలను వదులుకోలేదని స్మరించుకున్నారు. గతంలో బీసీ కార్పొరేషన్లకు కనీసం కుర్చీలు కూడా వేయకుండా అవమానించారని విమర్శించారు. తాము శాసనసభలో ఈ నిర్ణయాలు ప్రకటించగానే రేపు కోర్టుల్లో కేసులు వేసేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతుందని, మెగా డీఎస్సీ విషయంలోనూ అలాగే వందల కేసులు వేశారని వ్యాఖ్యానించారు. ఈ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్తే వైకాపా చరిత్రహీనులుగా మిగిలిపోతుందని హెచ్చరించారు.
ఏపీలో సగం జనాభా బీసీలే..
రాష్ట్రంలో 50.54 శాతం ఉన్న బీసీ జనాభాకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలనేదే కూటమి ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. బీసీలకున్న అద్భుత నైపుణ్యాలకు సాంకేతికతను జోడించి వారి శక్తిని ప్రపంచానికి చాటుతామని, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. బీసీ అంటే వెనుకబడిన వారు కాదని, అవకాశాలు రాక వెనుకబడిన వారని అభివర్ణించారు. పంచాయతీల నుంచి కేంద్ర కేబినెట్ వరకు వారి ప్రాతినిధ్యం పెంచుతామన్నారు. మౌలిక సదుపాయాలు మాత్రమే అభివృద్ధి కాదని, చిట్టచివరి వ్యక్తిని ముందుకు తెచ్చి ఆర్థిక అసమానతలు తొలగించడమే అసలైన అభివృద్ధని వ్యాఖ్యానించారు. 16వ ఆర్థిక సంఘం నుంచి గ్రామీణ ప్రాంతాలకు రూ.2300 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1562 కోట్ల గ్రాంట్లు రావాలంటే స్థానిక ఎన్నికలు అత్యవసరమని, అందుకే ప్రత్యేక కేబినెట్ నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ చారిత్రక సమావేశానికి ప్రతిపక్ష నేతలు హాజరుకాకపోవడాన్ని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను అవమానించిన తీరును ఎండగడుతూ 34 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు.
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బీసీ రిజర్వేషన్లపై తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఏమిటి?
స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది?
గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది బీసీల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి తోడ్పడుతుంది.
కొత్త జిల్లాలకు అనుగుణంగా ఎన్ని జిల్లా ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేయనున్నారు?
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజనకు అనుగుణంగా 28 జిల్లా ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల గురించి సీఎం చంద్రబాబు ఏ చారిత్రక అంశాలను ప్రస్తావించారు?
1995లో తాను ముఖ్యమంత్రిగా యాక్ట్-5 కింద 34% రిజర్వేషన్లు అమలు చేశానని, అంతకుముందు ఎన్టీఆర్ 1984లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.
స్థానిక ఎన్నికలు అత్యవసరమని సీఎం చంద్రబాబు ఎందుకు పేర్కొన్నారు?
16వ ఆర్థిక సంఘం నుండి గ్రామీణ ప్రాంతాలకు రూ.2300 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1562 కోట్ల గ్రాంట్లు రావాలంటే స్థానిక ఎన్నికలు అత్యవసరమని సీఎం తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















