Karachi 144 Section: పాక్‌లో భయానక వాతావరణం, కరాచీలో 144 సెక్షన్ అమలు - ఇంతకీ ప్రభుత్వ వ్యూహమేంటి ?
Section 144 imposed in Karachi | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో కరాచీలో 144 సెక్షన్ విధించారు.

Pahalgam Terrorist Attack: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఉగ్రదాడి జరిగి రోజులు గడిచేకొద్దీ పాకిస్తాన్‌లో భయం పెరుగుతోంది. మొదట ఉగ్రదాడిపై స్పందించకుండా, దాడిని ఖండించకుండా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పెద్ద తప్పిదం చేశారు. తరువా భారత్ తీసుకున్న 5 కీలక నిర్ణయాలతో దెబ్బకు పాక్ ప్రభుత్వం దిగొచ్చింది. భారత్ చేపట్టే విచారణలో తాము పాల్గొంటామని షరీఫ్ శనివారం అన్నారు. కానీ ఏం లాభం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పాక్ పరిస్థితి ఉంది. పాక్ మీద భారత్ దాడులు చేస్తుందన్న భయంతో ఇంతలో పాకిస్తాన్‌లోని కరాచీలో 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏఆర్వై న్యూస్ రిపోర్ట్ ప్రకారం, కరాచీ కమిషనర్ సయ్యద్ హసన్ నక్వి ఎస్ఐటీఈ ప్రాంతం, కెమారి జిల్లాలో రెండు నెలల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. దీని ఉద్దేశ్యం ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలని.. పైగా ఎలాంటి అలాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకూడదని పాక్ భావిస్తోంది. జూన్ 24 వరకు అక్కడ సెక్షన్ 144 అమలులో ఉంటుంది.
న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు
కరాచీ కమిషనర్ సయ్యద్ హసన్ నక్వి జనాలు గుంపుగా తిరగొద్దని, కరాచీ నగరంలో 144 సెక్షన్ అమలు చేశారు. దీని ప్రకారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భారీ వాహనాలు నగరంలోకి రావడంపై నిషేధం విధించారు. అయితే రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌ను తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నట్లు చెబుతున్నారు. 144 సెక్షన్ ఏప్రిల్ 17 నుండి జూన్ 16, 2025 వరకు అమలులో ఉంటుంది. రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నియమాలను ఉల్లంఘించే వారిపై పాకిస్తాన్ లోని సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు అవుతాయి. కరాచీని పాకిస్తాన్ ఆర్థిక రాజధానిగా వ్యవహరిస్తారు. ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా వ్యాపారం జరుగుతోంది. అలాంటి చోట కర్ఫ్యూ లాంటి నిర్నయాలు పిచ్చి పనులు అని నిపుణులు అంటున్నారు.
పాకిస్తాన్‌లో నిరంతర సమావేశాలు
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ప్రతిరోజూ రెండు నుంచి మూడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాలలో, భారత్ సరిహద్దులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన తన బంగ్లాదేశ్ పర్యటన రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పాకిస్తాన్ ముస్లిం దేశాల మద్దతును కూడగట్టేందుకు, సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ సౌదీ అరేబియా, కతార్, ఇరాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో పదే పదే మాట్లాడుతున్నారు. భారతదేశంతో చర్చలు జరిపి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని ఆ దేశాలను పాక్ కోరుతోంది.
పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మన కామెంట్లకు భారతదేశం సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. పాక్ నుంచి సందేశాలు పంపుతున్నాం, కానీ భారత్ నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు. పాకిస్తాన్, అమెరికా, ఇరాన్ వంటి దేశాలు జోక్యం చేసుకోవాలని పాక్ కోరింది. భారత్ తీవ్ర చర్యలు చేపడితే పాకిస్తాన్ కష్టాలు మరింత పెరుగుతాయని ఆందోళన నెలకొంది.






















