India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?
టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) అజేయంగా సూపర్-8లోకి అడుగుపెట్టిన టీమిండియాకు, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో కోచ్ కొటక్ టీమిండియా బలహీనతల గురించి చెప్పుకొచ్చారు. జట్టులో టాప్-3 బ్యాటర్లు ముగ్గురూ ఎడమచేతి వాటం వారే కావడం ప్రత్యర్థి జట్లకు వరంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులో ఆఫ్ స్పిన్నర్లు ఉన్నప్పుడు, ఈ ముగ్గురూ వరుసగా వికెట్లు పారేసుకోవడం జట్టును ఒత్తిడిలోకి నెడుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ మొదటి ఓవర్‌లోనే వికెట్ కోల్పోవడం దీనికి కారణం అని అంటున్నారు.
జింబాబ్వే జట్టులో ఆఫ్ స్పిన్నర్లు ఎక్కువ కాబట్టి, జట్టు కాంబినేషన్‌లో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. "ముందుగానే ప్లాన్ ను చెప్పడం కరెక్ట్ కాదు. కానీ మార్పుల గురించి ఆలోచిస్తున్నాం" అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో, రైట్ హ్యాండ్ బ్యాటర్, స్పిన్‌ను అద్భుతంగా ఆడే సంజూ శాంసన్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తిలక్ వర్మ లేదా అభిషేక్ శర్మలలో ఒకరిపై వేటు వేసి సంజూను ఓపెనర్‌గా లేదా వన్‌డౌన్‌లో పంపే అవకాశం ఉంది.
























