Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
East Godavari News | తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి హుకుంపేటలో మూడు అంతస్తుల భవనాన్ని 21 అడుగులు ముందుకు కదలించి రెండు అడుగుల ఎత్తుకు లేపుతున్న పనులు స్థానికంగా ఆసక్తి కరంగా మారింది..

Building Shifting after receives Notice from Official | సాధారణంగా రోడ్డు విస్తరణలు, ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టినప్పడు నోటీసులు ఇచ్చి భవనాలను కూలకొడుతుంటారు. కొన్ని నెలల కిందట తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు, చెరువులు, ఇతర జలాశయాల ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం తెలిసిందే. అయితే ఎప్పుడో నిర్మించిన భవనాన్ని తొలగించాలని అకస్మాత్తుగా నోటీసులు ఇచ్చి అధికారులు ఆదేశిస్తే... సరిగ్గా ఓ ఇంటి యజమానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
కానీ మూడు అంతస్తుల భవనాన్ని కూల్చడం ఇష్టంలేక 21 అడుగులు ముందుకు కదిపేందుకు బిహార్‌కు చెందిన ఓ సంస్థకు పని అప్పగించారు. ఎట్టకేలకు తమ భవనాన్ని ముందుకు కదల్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అంతేకాదు.. రెండు అడుగుల ఎత్తు కూడా పెంచేలా చేయించారు. దీనికోసం రూ.70 లక్షలు ఖర్చు చేయగా రెండు నెలల కిందట చేపట్టిన భవనం కదలింపు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.
దాదాపు 7 సెంట్లు స్థలంలో ఉన్న ఈ అతిపెద్ద భవనాన్ని విజయవంతంగా ముందుకు తరలించడంలో సక్సెస్ అయ్యారు భవన యజమాని. రాజమండ్రి హుకుంపేటకు చెందిన సిద్దార్ధ పాఠశాల యజమాని మద్దాల కృష్ణమూర్తి హుకుంపేట జాతీయ రహదారిని ఆనుకుని సిద్ధార్ధ పాఠశాలను నడుపుతున్నారు. రాజమండ్రి హుకుంపేట మీదుగా ప్రవహిస్తున్న ఆవకాలువ(మురుగు కాలువ) ను ఆనుకున్న నిర్మాణాలు తొలగించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.
అందులో కృష్ణమూర్తికి చెందిన ఓ భవనం కూడా ఉండగా ఈబభవనాన్ని తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. కార్పోరేషన్ ద్వారా నోటీసులు అందుకున్న కృష్ణమూర్తి అధికారులను కొంత సమయం కోరారు. వెంటనే భవనాన్ని ముందుకు కదలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికోసం స్ట్రక్చరల్ ఇంజనీర్ల ద్వారా బిహార్‌కు చెందిన 40 మంది నైపుణ్యమున్నవారిని రప్పించి పనులు చేపట్టారు. 100 అడుగుల పొడవు, 34 అడుగులు వెడల్పుతో దాదాపు 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని ట్రాలీ జాకీల సాయంతో పైకి లేపి 21 అడుగులు ముందుకు విజయవంతంగా జరిపారు. ఇప్పుడు రెండు అడుగులు ఎత్తు లేపే పనులు జరుపుతున్నారు. ఈ పనులు జరుగుతుండగా భవనంలో ఎక్కడి సామాన్లు అక్కడే ఉంచగా ఈ భవనంలో నివాసం ఉండే కుటుంబాలు యథాతథంగా నివాసం ఉండటం విశేషం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

