Annamaiya Collector Suspension : ఐఏఎస్, ఐపీఎస్‌ల మెడకు నకిలీ ఓట్ల వ్యవహారం - అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు !
AP Fake Votes : ఏపీలో దొంగ ఓట్ల అక్రమాలు సివిల్ సర్వీస్ అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra Pradesh Fake Votes Dispute : ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ ఓట్ల వ్యవహారంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బలవుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నకిలీ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆలస్యంగా చర్యలు చేపట్టింది. అప్పట్లో తిరుపతి ఆర్వోగా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా ఐఏఎస్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈసీఐ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాని సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం తేదీతో సీఎస్ జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ విజయవాడ వదిలి వెళ్లొద్దని గిరీషాకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఓటర్ల జాబితాలపై ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులను పరిశీలిస్తున్న వేళ సంచలన నిర్ణయం తీసుకుంది. 2021లో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు తయారు చేసారని, వారికి నాడు తిరుపతి కార్పోరేషన్ కమిషనర్ గా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపైన ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఎన్నికల సమయంలో ఆయన లాగిన్ ఐడీ ద్వారా దాదాపు 30 వేలకు పైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్ లోడ్ చేసారనే ఫిర్యాదులు ఉన్నాయి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సహకరించారని ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి.
ఈ ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారం పై ఎన్నికల సంఘం విచారణ చేసింది. గిరీషా ఎపిక్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో నిర్దారణ అయింది. దానిపై ఇటీవల విజయవాడ లో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైనా చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. దొంగ ఓట్ల అక్రమాల్లో మరో ఐఏఎస్, ఐపీఎస్ మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో ఓటర్ల లిస్ట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అధికారులు వైసీపీ లీడర్లు ఏకమైన ప్రత్యర్థుల ఓట్లను తొలగిస్తున్నారని.. తమకు అనుకూలురైన వారి ఓట్లను దొంగ ఓట్లుగా చేర్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దీనిపై వివిధ స్థాయిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ మధ్య రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యామ్ ఫిర్యాదు చేశారు. ఫామ్ 7 పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని చర్యలు తీసుకోవాలని సాక్ష్యాలతో ఇచ్చారు. ఇప్పుడు గిరీషాపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం ఇతర అధికారులపై కూడా దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా మంది అధికారులు వైసీపీ లీడర్లు చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారందర్నీ ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.