Andhra Pradesh: వాలంటీర్లు పింఛన్ల పంపిణీ చేయొద్దు: ఈసీ కీలక ఆదేశాలు
AP Pensions: ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

Andhra Pradesh Vounteers Pension Distribution: అమరావతి: ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఆంక్షలు విధించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల కారణంగా పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. పింఛన్ మాత్రమే కాదు, ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయించవద్దని ఈసీ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ తెలిపింది.
ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్ డిపాజిట్ చేయాలని తమ ఆదేశాలలో ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ సహా ఇతర సంక్షేమ పథకాల నగదును ఆన్‌లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. లేకపోతే రెగ్యూలర్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తన ఆదేశాలలో ఈసీ పేర్కొంది.
మార్చి 16న సీఈసీ రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అదే సమయం నుంచి దేశ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఏప్రిల్ 18న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నాలుదో దశలో మే 13న ఏపీలో ఎన్నికలు నిర్వహించి, జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే అనుమతులు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సువిధా యాప్ (Suvidha App) ద్వారా అనుమతులు తీసుకోవాలని.. 392 ధరఖాస్తులు అందగా, వాటిలో 10 ఈసీ పరిధిలోనివి అని ఇటీవల ఆయన తెలిపారు. మిగతా కేసులు జిల్లా ఎన్నికల అధికారుల పరిధిలో ఉన్నాయి. ఎం.సి.సి (MCC) ఉల్లంఘనకు సంబందించిన ఫిర్యాదులను సీ విజిల్ యాప్ (cVIGIL app) ద్వారా నమోదు చేసుకున్న 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు దాదాపు 1,173 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నాయని.. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకూ 1,307 ఫిర్యాదులు అందగా, వాటిలో 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించినట్లు వెల్లడించారు. సి-విజిల్ పిర్యాధుల్లో 95 శాతం మేర పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తాం. ఈ యాప్ ను అందరూ వినియోగిస్తూ ఎం.సి.సి. ఉల్లంఘనలను నియంత్రించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

