Kallakkadal Warning: 2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉంది. జనవరి 15న జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది.
Kallakkadal alert to Kerala and Tamil Nadu | తిరువనంతపురం: కేరళ, తమిళనాడు(Tamil Nadu) తీరాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘కల్లక్కడల్’(Kallakkadal) ముప్పు పొంచి ఉన్నందున తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జనవరి 15న రాత్రి సముద్రంలో అకస్మాత్తుగా ఉప్పెన రానున్న కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 15 అర్ధరాత్రి దాదాపు 11.30, 12 గంటల వరకు తీరం వెంట పలు ప్రాంతాల్లో ఒక మీటర్ మేర అలల తాకిడి ఉండనుంది. బుధవారం రాత్రి సముద్ర ఉప్పెన కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని కేంద్ర సంస్థ ఐఎన్‌సీవోఐఎస్ తమిళనాడు, కేరళ తీర ప్రాంతాల జిల్లాలను హెచ్చరించింది. ఇలాంటివి ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉంటుంది.
కల్లక్కడల్ అంటే ఏంటి..
సాధారణంగా మనం అల్పపీడనం, వాయుగుండం, తుపాను గురించి వింటూనే ఉంటాం. కొంచెం అలాంటిదే ఈ కల్లక్కడల్ (ఉప్పెన తరంగాలు). సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పులను కల్లక్కడల్ అంటారు. సముద్రం ఒక్కసారిగా తీరం నుంచి దూసుకొచ్చే అవకాశం ఉందని ఐఎన్‌సీవోఐఎస్ తెలిపింది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో వీచే బలమైన గాలుల కారణంగా సముద్రం అకస్మాత్తుగా ఉప్పొంగే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రాంతం నుంచి దక్షిణ హిందూ మహాసముద్రం వరకు వ్యాపించడం వల్ల కల్కక్కడల్ సంభవిస్తుంది. అయితే అకస్మాత్తుగా బలమైన అలలు ఎప్పుడు ఎగసిపడతాయో తెలియదు కనుక దీనిని కల్లక్కడల్ అని పిలుస్తారని అధికారులు వెల్లడించారు.