Alla Ramakrishna Reddy : వైసీపీ నేతలను కాంగ్రెస్‌లో చేర్చేందుకు ప్రయత్నాలు - ఆళ్ల రామకృష్ణారెడ్డి రహస్య చర్చలు!
YSRCP : వైసీపీలో పెద్దగా ప్రాధాన్యం లభించని నేతల్ని కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నారు. మర్రి రాజశేఖర్ తో భేటీ కావడం కలకలం రేపింది.
Alla Ramakrishna Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఆదరణ లభించని నేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఇంటికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరికీ తెలియకుండా.. . చెప్పా పెట్టకుండా వెళ్లారు. వైసీపీలో ఎంత పని చేసినా ప్రయోజనం ఉండదని.. కాంగ్రెస్ లోకి వస్తే ఏపీ పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే మర్రి రాజశేఖర్ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆయన మర్రి రాజశేఖర్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపినట్లుగా బయటకు తెలియడంతో వైసీపీలో ఒక్క సారిగా కలకలం బయలుదేరింది.
మర్రి రాజశేఖర్ కాంగ్రెస్ తరపున ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో చివరి రోజుల్లో విజదల రజనీని పార్టీలోకి తీసుకుని టిక్కెట్ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి హమీ ఇచ్చారు. ఇలా ఆళ్ల రామకృష్ణారెడ్డికీ హామీ ఇచ్చారు. లోకేష్ పై గెలిపిస్తే మంత్రిని చేస్తామన్నారు. కానీ ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో విడదల రజనీని చిలుకలూరిపేట నుంచి మార్చి గుంటూరు పశ్చిమకు ఇంచార్జ్ గా నియమించారు. కానీ టిక్కెట్ మాత్రం మర్రి రాజశేఖర్ కు కాకుండా.. మరో నేతకు ఖరారు చేశారు. దీంతో మర్రి రాజశేఖర్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ వర్గాలు అలర్ట్
ఏపీ వ్యాప్తంగా వైసీపీలో ఆదరణ దక్కని నేతలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ వర్గాలు అలర్ట్ అయ్యాయి. కాంగ్రెస్ లోకి ఎవరూ వెళ్లవద్దని సూచిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్‌లో చేరుతున్నానని షర్మిల ప్రకటించారు. కుటుంబ సమేతంగా ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను YSR ఘాట్ వద్ద ఉంచారు. ఈ తర్వాత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించామని షర్మిల తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. ఇవ్వాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు. కేసీఅర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో YSRTP చాలా పెద్ద పాత్ర పోషించిందని గుర్తు చేశారు. 31 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వేల లోపు మెజారిటీతోనే గెలిచారని.. దీనికి కారణం YSR తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడమేనన్నారు. YSRTP ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కి ఇబ్బంది అయి ఉండేదని గుర్తు చేశారు.
ఈ కృతజ్ఞతా భావం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉందని తెలిపారు. మా త్యాగానికి విలువ నిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం పంపారని.. కాంగ్రెస్ లో చేరడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ.. ప్రతి ఒక్కరికీ భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నామన్నారు. బుధవారం షర్మిలతో పాటు ఢిల్లీకి వెళ్లే వారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.