Jesus: సిలువపై యేసు క్రీస్తును రోమన్ సైనికులు ఎన్నిగంటలు చిత్ర హింసలు పెట్టారో తెలుసా!
The Unimaginable Suffering of Jesus: సిలువ మరణం ఎలా ఉంటుంది. యేసు క్రీస్తు ఎన్ని గంటల సిలువ శ్రమలు అనుభవించారు అనేది తెలుసా. ఈ కథనం చదివితే పూర్తిగా అవగతం అవుతుంది.

Jesus: యేసు క్రీస్తు సిలువపై శ్రమ అనుభవించి చనిపోయారని బైబిల్ ప్రబోధిస్తుంది. యేసు క్రీస్తు కాలం నాటి యూదా చరిత్ర కారులు సైతం ఈ అంశాన్ని తమ రచనల్లో కొంత పేర్కొన్నారు. అయితే యేసు క్రీస్తును ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎంత సమయం బందీగా ఉన్నారు. ఆయనపై చేసిన ఆరోపణల మీద జరిపిన విచారణ సమయం ఎంత,ఆ తర్వాత యేసు క్రీస్తును రోమన్ సైనికులు ఎలా హింసించారు. యేసు క్రీస్తు ఎన్నిగంటలు సిలువై వేలాడి చనిపోయారు అన్న సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
1. గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు అరెస్ట్ ( రాత్రి 11 గంటల నుండి అర్థరాత్రి 2 గంటల మధ్యలో)
యేసు క్రీస్తు సిలువపై చనిపోకముందు అంటే గురువారం ( శుక్రవారం సిలువేసిన రోజు, ముందు రోజు) సాయింత్రం ఆరు గంటల నుంచి 9 గంటల మధ్యలో యేరుషలేంలో ఉన్న మేడ గదిపై పస్కా అనే యూదుల పండుగ ఆచరిస్తారు. తన 12 మంది శిష్యులతో ఆ మేడ గదిపైన లాస్ట్ సప్పర్ గా చెప్పే చివరి విందును ఆరగిస్తారు. ఆ సమయంలోనే ఆయనను రోమన్ సైనికులకు పట్టించిన శిష్యుడు ఇస్కరి యోతు యూదా రాత్రి 9 గంటల సమయంలో యేసు క్రీస్తుకు విరోధంగా పని చేసేందుకు మేడ గది నుంచి బయటకు వెళ్లిపోతాడు. అక్కడి నుంచి యేసు క్రీస్తు తన వాడుక చొప్పున గెత్సెమనే అనే తోటకు వెళ్లి అక్కడ తన శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తారు. అప్పుడు దాదాపు రాత్రి 11 నుండి అర్థ రాత్రి 2 గంటల సమయంలో ఆయన్ను రోమన్ సైనికులు, యూదా మత పెద్దలు అరెస్ట్ చేసి యూదా ప్రీస్ట్ ( ప్రధాన యాజకుడు) దగ్గరకు తీసుకెళ్లనట్లు బైబిల్ చెబుతోంది. యేసు క్రీస్తు అరెస్ట్ చేసినప్పటి నుండి ఆయన మరుసటి రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు హింస అనుభవిస్తూనే ఉన్నట్లు బైబిల్ లో రాయబడింది. ప్రీస్ట్ దగ్గరకు తీసుకెళ్లిన సమయంలో యేసు క్రీస్తుపై ఉమ్మి వేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన మోహం పై దాడి చేసి కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన్ను ఓ గుహ లాంటి గదిలో బంధించడం జరుగుతుంది.
రోమా గవర్నర్ పొంతి పిలాతు వద్దకు విచారణ ( తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం ఆరు గంటలసమయంలో)
యేసు క్రీస్తును చంపాలని నిర్థారించుకున్న మత పెద్దలు రోమా గవర్నర్ పొంతి పిలాతు వద్దకు తీసుకెళ్తారు. అప్పడు దాదాపు తెల్లవారు 3 గంటల నుండి ఉదయం ఆరు గంటల మధ్యలో జరిగి ఉండవచ్చని బైబిల్ పండితులు చెపుతారు. ఆయనతో పాటు యూదయ ప్రాంత పాలకుడు హేరోదు దగ్గరకు విచారణ నిమిత్తం యేసు క్రీస్తును తరలిస్తారు.
39 కొరడా దెబ్బలు ( ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మింటి వరకు)
హేరోదు రాజు యేసు క్రీస్తును తిరిగి రోమా గవర్నర్ పిలాతు వద్దకు తేవడంతో ఆయన యేసు క్రీస్తును కొరడాలతో శిక్షించమని ఆదేశిస్తారు. ఇది శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంటి ఉదయం తొమ్మిదింటి వరకు జరిగి ఉండవచ్చని చెప్తారు. ఈ కొరడాను ఫ్లాగెల్లం అంటారు. ఇది తోలు తాళ్లకు చివరన గేలం లాంటి లోహంతో కూడిన ముళ్లులు, మొన తేలిన ఎముకలు ఉంచి కొరడాతో శిక్షించే వారు. అలా నేరస్థుడ్ని గట్టిగా కొడితే అతని చర్మంలో దిగబడి కొంత మేర మాంసాన్ని కూడా చీల్చుకు వచ్చేలా అప్పటి కొరడాలు తయారు చేసే వారు. అలాంటి కొరడాతో యేసు క్రీస్తును 39 కొరడా దెబ్బలు కొట్టారు. అలా కొట్టడం వల్ల అప్పటికే ఆయన వీపు భాగం అంతా చర్మం, మాంసం ఊడి రక్తసిక్తమయినట్లు బైబిల్ పండితులు, చరిత్ర కారులు చెబుతారు. ఇది రోమన్లు శిక్షించే విధానంగా చెప్పారు. అంతే కాకుండా యేసు క్రీస్తుకు ముళ్లతో చేయబడిన కిరీటం తలపై ధరింపజేసి, గట్టిగా ముళ్లు లోపలికి దిగేలా చేత్తో రోమన్ సైనికుల వత్తడం జరిగిందని,ఆ తర్వాత ముళ్లు బాగా లోపలికి దిగేలా కర్రతో తలపై కొట్టారని బైబిల్ లో రాయడం జరిగింది.
సిలువ శిక్ష - ( ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు )
కొరడాతో కొట్టిన తర్వాత రోమన్ గవర్నర్ పిలాతు యేసు క్రీస్తును విడుదల చేయాలని చూస్తారు. కాని యూదా మత పెద్దలు అక్కడి వారు ఆయన్ను సిలువ వేయాలని గట్టిగా పట్టుబడతారు. దీంతో చేసేదేమి లేక విచారణ ముగించి యేసు క్రీస్తును సిలువ వేయాలని రోమన్ సైనికులను పిలాతు ఆదేశిస్తారు. దీంతో రోమన్ సైనికులు 60 నుండి 70 కేజీల బరువు ఉండే చెక్కతో చేయబడిన సిలువ ను ఆయన భుజాల పై పెట్టి యేరుషలేం నుండి సిలువ వేసే స్థలం గొల్గతా అనే కొండ వరకు నడిపించారు. అప్పటికే రక్తసిక్తమై ఉన్న యేసు క్రీస్తు సొమ్మసిల్లే పరిస్థితుల్లో సిలువ మోయలేక పడిపోతే దారి మధ్యలో సీమోను అనే అతని పై ఆ సిలువ పెట్టి గొల్గతా అనే ప్రాంతానికి నడిపిస్తారు. అక్కడ ఆయన రెండు చేతుల్లో, కాళ్లలో ఐదు నుంచి ఆరు అంగుళాలు ఉండే పదునైన లోహపు మేకులతో సిలువకు కొట్టడం జరిగింది. దీంతో చేతులు, కాళ్ల నుండి రక్తం తీవ్రంగా స్రవించినట్లు బైబిల్ పండితులు చెప్తారు. సిలువను లేపి అప్పటికే తవ్విన గోతిలో నిలబెట్టడం సిలువ వేయడంలో ముఖ్యమైన ఘట్టం. అప్పుడు శరీరం అంతా మేకులు కొట్టిన చేతులు, కాళ్లపై పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. మరో వైపు చేతులపై, కాళ్లపై శరీర బరువు ఉండటంతో తీవ్రంగా చేతులు, కాళ్ల నొప్పి బాధిస్తుంది. ఇలా సిలువ శ్రమలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఆయన చనిపోయే సమయం మూడు గంటల వరకు సాగింది. శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన రక్త స్రావం, అవమానం, మానసికంగా వేధించడం, డీ హైడ్రేషన్ వంటి కారణాలతో యేసు క్రీస్తు మరణించినట్లు చెపుతారు. చివరలో యేసు క్రీస్తు చనిపోయాడా లేదా అని తెలుసుకునేందుకు ఓ సైనిక అధికారి ఆయన పొట్టలో బల్లెంతో పొడవడం కూడా జరుగుతుంది.
దాదాపు 16 గంటల హింసను ఎదుర్కొన్న యేసుక్రీస్తు
గురువారం రాత్రి 11 గంటల నుండి 2 గంటల మధ్యలో యేసు క్రీస్తును అరెస్ట్ చేసిన సమయం నుండి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 13 నుండి 16 గంటలు యేసు క్రీస్తు హింసను ఎదుర్కొన్నట్లు బైబిల్ పండితులు చెప్తారు. ఇక తీవ్రమైన హింస శుక్రవారం ఉదయం కొరడా దెబ్బల కొట్టినప్పటి నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగినట్లు చెప్తారు. ఆనాడు రోమన్ సైనికుల శిక్ష ఎంతో భయంకరంగా ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నేరస్థులను, తిరుగుబాటు దారులను, దేశ ద్రోహులను భయపెట్టేలా ఎలాంటి కనికరం లేకుండా సిలువ శిక్షను వారు అమలు పరిచే వారు. ఇలా యేసుక్రీస్తు సుమారు 13 నుండి 16 గంటలు హింస పొంది మరణించారని బైబిల్ పండితులు బైబిల్ లో రాయబడిన అంశాలతో పాటు యేసు క్రీస్తు నాటి సమకాలీన చరిత్రకారులు రాసిన గ్రంధాల ఆధారంగా విశ్లేషించి చెప్తారు.






















