Crime News: నగరంలో మరో విషాదం.. కూల్ డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెకు ఇచ్చి, తాను తాగిన తల్లి! చిన్నారి మృతి
Medchal Crime News | మేడ్చల్ జిల్లాలో మరో తల్లి కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. విషం తాగిన చిన్నారి చనిపోగా, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

మేడ్చల్ జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన కంటి పాప ప్రాణాలు తీసింది. విషం పెట్టి చిన్నారిని మరో తల్లి చిదిమేసిందని స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మొన్న గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు కొడుకులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేసి, ఆత్మహత్య చేసుకోడం మరువకముందే నగరంలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ లో నాలుగు సంవత్సరాల కూతురికి విషం ఇచ్చింది. తల్లి కూడా విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కూతురు మృతి చెందగా , ఆసుపత్రిలో తల్లి చికిత్స పొందుతోంది. కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్ లో తల్లి చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
కూకట్‌పల్లి ప్రగతి నగర్ లోని హరిత ఆర్కేడ్, ఆదిత్య గార్డెన్స్ లో సాంబశివరావు ఫ్లాట్ నెం. 102లో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య నంబూరి కృష్ణ పావని అనే మహిళ (33) ఏప్రిల్ 18న సాయంత్రం 04:30 గంటలకు కూల్ డ్రింకులో పి ఎలుకల మందు కలిపింది. నాలుగున్నరేళ్లు కుమార్తె జెష్వికకు కూల్ డ్రింక్ ఇచ్చి, తాను కూడా తాగింది.
మరుసటి రోజు (19.04.2025) ఉదయం 04:30 గంటలకు తాము విషం తీసుకున్నామని తన భర్తకు కృష్ణ పావని తెలిపింది. అప్రమత్తమైన సాంబశివరావు ఇంటికి చేరుకుని తన భార్య, కుమార్తెను ఉదయం 08.45 గంటలకు చికిత్స నిమిత్తం కేపీహెచ్‌బీలోని ప్రసాద్ ఆసుపత్రికి తరలించాడు. ఆమె ప్రసాద్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది.
చిన్నారి జెష్విక పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు సాయంత్రం 06.30 గంటల ప్రాంతంలో కేపీహెచ్‌బీలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి జెష్విక చనిపోయింది. హాస్పిటల్ యాజమాన్యం కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జెష్విక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పావని భర్త పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనారోగ్య కారణాలతో కూతురికి విషం ఇచ్చి, పావని ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట్ ఎగ్జిట్ 4A వద్ద తెల్లవారుజామున ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోకాపేట్ వాసి భాను ప్రకాష్, అతని స్నేహితుడు అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.






















