Kakinada DCCB Chairman: కాకినాడ డీసీసీబీ ఛైర్మన్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
Kakinada News | కాకినాడ డీసీసీబీ ఛైర్మన్ పదవికోసం టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. ఉమ్మడి తూర్పగోదావరి జిల్లాకు సంబందించిన పదవి కావడంతో ఈపోటీ మరింత తీవ్రం అయ్యింది..

Kakinada DCCB Chairman | ఏటా రూ. 10వేల కోట్ల టర్నోవర్న్.. మూడు జిల్లాలుకు సంబందించి రైతాగం.. 298 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు.. ఇవన్నీ కలిస్తే కాకినాడ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు.. ఇంతటి ప్రాధాన్యత కలిగిన డీసీసీబీ ఛైర్మన్ పదవి అంటే ఎవరికి కాంక్ష ఉండదు.. అందుకే ఇప్పడు ఈ పదవికి పోటీ తీవ్రమయ్యింది.. అధ్యక్ష పదవి కోసం హోరాహోరీ మొదలైంది. అయితే ఈ సారి సొసైటీలకు, బ్యాంక్ డైరెక్టర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలో ఉన్నారని తెలుస్తోండగా ఈ పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ వీడడం లేదు.
వేలాది మంది రైతులతో ముడిపడి..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు వేలాది మంది ఉంటారు. వీరి కార్యకలాపాలన్నీ గ్రామాల్లో ఉన్న ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలతో ముడిపడి ఉండగా వ్యవసాయ రుణాల నుంచి ఇతర అవసరాలన్నీ ప్రాధమిక సహకార సంఘాలే తీరుస్తాయి.. అయితే వీటన్నిటిపైనా కీలకంగా పర్యవేక్షణచేసే డీసీసీబీ ఏటా రూ.10 వేల కోట్ల వరకు టర్నోవర్ సాధిస్తోంది.. ఉమ్మడి తూర్పోగోదావరి జిల్లాలో 298 పీఏసీఎస్‌లు ఉండగా ఇందులో తూర్పుగోదావరి 49, కాకినాడ 72, అత్యధికంగా కోనసీమ జిల్లాలో 166 పీఏసీఎస్‌లు ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబందించి 11 పీఏసీఎస్‌లు ఉండడం ఇందులో కలిసే ఉన్నాయి.
సమస్యల వలయంలో డీసీసీబీ..
వాస్తవానికి డీసీసీబీ ఇంకా మంచి ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన పరిస్థతి ఉండగా అవినీతి ఆరోపణలు, అనేక పెండింగ్ సమస్యలు వెనక్కు లాగే పరిస్థతి కనిపిస్తోంది.. దీర్ఘకాలంగా సభ్యత్వ రుసుంల నుంచి పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయి. 2018తర్వాత ఇప్పటివరకు సొసైటీలకు, బ్యాంక్ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరపలేదు. దీంతో సభ్యత్వ నమోదు పునరుద్ధరణతో పాటు మార్పులు, చేర్పులు, తుది జాబితాల వెల్లడి, ఇలా కనీసం ఏడాది పాటైనా బ్యాంక్, సొసైటీల ఎన్నికలకు సమయం కావాలి. దీంతో మరోసారి సొసైటీలు, బ్యాంక్ పాలకవర్గాలను నామినేటెట్ విధానంలోనే నియమించక తప్పని పరిస్థితి ప్రభుత్వానికేర్పడింది. దీన్ని గుర్తించి రాష్ట్రంలో అతిపెద్దదైన ఉమ్మడి తూర్పు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవితో పాటు డైరెక్టర్ల పదవుల కోసం మూడు పార్టీల్లో హేమాహేమీలంతా ప్రయత్నాలు ప్రారంభించారు.
గత పాలకులపై అవినీతి మరకలు..
జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కోసం ఎందుకంత పోటీ అనే అంశంపై అనేక విమర్శలు ఎదురవుతున్నాయి.. ఈ పదవి పొందేందుకు ఎందకంత పోటీ అంటే గతంలో అవినీతికి పాల్పడ్డవారు కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలున్నాయి.. ఈ పదవి చేసిన వారిలో అత్యధికులు దోపిడీదార్లుగా ముద్రపడ్డారు. ఆకాశం శ్రీరామచంద్రమూర్తి, శిరంగు కుక్కుటేశ్వరరావు వంటి ముగ్గురు నలుగురు తప్ప గతకొంతకాలంగా వరుసగా ఈ పదవిని అధిష్టిస్తున్న ప్రతి ఒక్కరు వందల కోట్ల కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. వరుపుల సుబ్బారావు హయాంలో శక్తి గ్యాస్ అంటూ బ్యాంక్ను పక్కదారి పట్టించారు. పంతం గాంధీమోహన్ హాయంలో వంద ల కోట్ల ఆరోపణలొచ్చాయి.
ఇక వరుపుల రాజా అయితే లెక్కలేని కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహించిన లంపకలోవ సొసైటీలో భారీ ఆర్థిక కుంభకోణాలున్నట్లు విచారణాధికారి తేల్చేశారు. ఈ ఆర్థికనేరాల ఒత్తిళ్ళ కారణంగానే రాజా ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే ఈ బ్యాంక్ చైర్మన్ పదవి అంటే వందల కోట్ల దోపిడీకి జాతీయ రహదారిగా రాజకీయాల్లో పేరుపడింది. ఈదశలో గతంలో ఆరోపణలెదుర్కొన్న వ్యక్తులకే ఈ పదవి కట్టబెట్టాలన్న ఆలోచన విమర్శలకు తావిస్తోంది. పలువురు ఎమ్మెల్యేల సిఫార్సుపొందిన పిల్లి సత్తిబాబుపై గతంలో తీవ్రమైన ఆర్దిక ఆరోపణలొచ్చాయి.
ఛైర్మన్ పదవి కోసం టిడిపి, జనసేనల పట్టు..
కాకినాడ డీసీసీబీ ఛైర్మన్ గిరీ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా స్థాయి పదవి కావడంతో పాటు ఆర్ధిక వ్యవస్థలో అత్యంత కీలకమైన చైర్మన్ గిరిని తామే దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ గట్టిపట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు చైర్మన్ గిరి కోసం సిఫార్సులు కూడా ప్రారంభించారు. ఎమ్మెల్యే టికెట్ పొందలేక పోయిన కొందరు సీనియర్లు తమకీ పదవివ్వాలంటూ అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. తమకు తెలిసిన మంత్రుల ద్వారా చంద్రబాబుకు చెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన జిల్లా సహకార బ్యాంక్ ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్న పట్టుదల ప్రదర్శిస్తోంది.. ఆ పార్టీ కాకినాడ జిల్లాలో ఆధిపత్యంలోనే కొనసాగుతోంది. పిఠాపురం, కాకినాడ రూరల్‌తోపాటు కాకినాడ పార్లమెంటు స్థానంలో పట్టునిలుపుకున్న జనసేన ఇప్పడు అధినేత పవన్ కళ్యాణ్ చొరవ ద్వారా డీసీసీబీ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
కోనసీమ జిల్లాలో అత్యధికంగా పీఏసీఎస్‌లు ఉండడం వల్ల కోనసీమ ప్రాంతానికి చెందిన మెట్ల రమణబాబు కూడా రేసులో ఉన్నారు. దివంగత మంత్రి మెట్ల సత్యనారాయణ కుమారుడు అయిన రమణబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.. దివంగత మెట్ల సత్యనారాయణ ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలో పని చేశారు. ఆయన మరణానంతరం కుమారుడు రమణబాబు కోనసీమ టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకిప్పటివరకు సరైన గుర్తింపు లభించలేదు. ఇదిలా ఉంటే డిసిసిబి చైర్మన్ కోసం కాపులు, శెట్టిబలిజల మధ్య పోటీ నెలకొంది. గతంలో వరుసగా కాపులే ఈ పీఠాన్ని అధిష్ఠించారు. కాంగ్రెస్, టిడిపి, వైకాపా హయాంలో కాపులకే చైర్మన్ దక్కడం ఇప్పడు రెండు కులాల మధ్య పోరుగా మారింది..





















