Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?
Infosys Final Dividend: ఏకాగ్రకు 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి. 17 నెలల ఈ పసికూన ఏకంగా రూ.3.3 కోట్ల డివిడెండ్ సంపాదించాడు.

Who is Ekagrah Rohan Murty: ఏకాగ్ర రోహన్ మూర్తి పేరు మీరు విన్నారా?, అతని వయస్సు 17 నెలలే కాబట్టి ప్రపంచానికి పరిచయం లేదు, ఆ బుడతడి గురించి మీరు ఎక్కడా విని ఉండకపోవచ్చు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మీకు తెలుసు కదా. శిఖరం లాంటి ప్రతిభతో ఒకప్పుడు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పుడు మూర్తి గారు హెడ్‌లైన్స్‌లో నానుతున్నారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారి మనవడే 17 నెలల వయస్సున్న ఏకాగ్ర రోహన్ మూర్తి. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (FY25), ఇన్ఫోసిస్ తుది డివిడెండ్‌లో భాగంగా, మూర్తి గారి మనవడు రూ.3.3 కోట్లు అందుకోనున్నాడు. డివిడెండ్ అందుకుంటున్న వారిలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కులలో ఒకడు ఏకాగ్ర రోహన్ మూర్తి.
ఏకాగ్ర 2023 నవంబర్‌లో బెంగళూరులో జన్మించాడు. రోహన్ మూర్తి & అపర్ణ కృష్ణన్ దంపతుల కుమారుడు. నారాయణ మూర్తి & రాజ్యసభ ఎంపీ సుధామూర్తి దంపతుల మూడో మనవడు. అక్షత మూర్తి & UK ప్రధాన మంత్రి రిషి సునాక్ కుమార్తెలైన కృష్ణ, అనౌష్కలు ఏకాగ్రకు కజిన్స్.
15 లక్షల షేర్లు
ఎకాగ్ర రోహన్ మూర్తి ఇన్ఫోసిస్‌లో 15 లక్షల షేర్లు ఉన్నాయి, ఇది కంపెనీలో 0.04 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను, బాలుడి నాలుగు నెలల వయసులో నారాయణ మూర్తి బహుమతిగా ఇచ్చారు. 2024 మార్చిలో ఈ బహుమతి ఇచ్చే సమయానికి ఆ షేర్ల మొత్తం రూ. 240 కోట్లకు పైగా ఉంది.
2025 ఏప్రిల్ 17న, ఇన్ఫోసిస్ ఒక్కో షేరుకు రూ. 22 తుది డివిడెండ్ ప్రకటించింది. ఎకాగ్ర వాటాల ఆధారంగా, తుది డివిడెండ్ నుంచి ఎకాగ్ర రూ. 3.3 కోట్లు సంపాదిస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అతను మధ్యంతర డివిడెండ్ల రూపంలో అందుకున్న రూ. 7.35 కోట్లకు ఇది కూడా యాడ్ అవుతుంది. దీంతో, మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ పసివాడి మొత్తం డివిడెండ్ ఆదాయం రూ. 10.65 కోట్లకు చేరుకుంటుది.
ఇన్ఫోసిస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, డివిడెండ్ అర్హత కోసం రికార్డు తేదీ 30 మే 2025. ఈ తేదీ నాటికి ఎవరి డీమ్యాట్ ఖాతాలో ఇన్ఫీ షేర్లు ఉంటాయో, వాళ్లు డివిడెండ్ అందుకోవడానికి అర్హులు. డివిడెండ్ చెల్లింపులను జూన్ 30న షెడ్యూల్ చేశారు.
ముర్తి గారి కుటుంబానికి భారీ ఆదాయం
నారాయణ మూర్తి గారి కుటుంబం ఇన్ఫోసిస్ ప్రమోటర్ గ్రూప్‌లో భాగం. నారాయణ మూర్తి కుటుంబ సభ్యుల పేరిట కోట్లాది షేర్లు ఉన్నాయి. వారంతా కంపెనీ తుది డివిడెండ్ నుంచి భారీ ఆదాయం పొందుతారు. నారాయణ మూర్తి స్వయంగా రూ. 33.3 కోట్లను ఇంటికి తీసుకువెళతారని, ఆయన భార్య సుధామూర్తి రూ. 76 కోట్లు అందుకుంటారని అంచనా. 3.89 లక్షల షేర్లను (కంపెనీలో 1.04 శాతం వాటాకు సమానం) కలిగి ఉన్న వారి కుమార్తె అక్షత మూర్తి రూ. 85.71 కోట్లు సంపాదిస్తారని భావిస్తున్నారు.
1981లో రూ. 10,000 పెట్టుబడితో ఐటీ ప్రపంచ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇన్ఫోసిస్, దినదినాభివృద్ధి చెందింది. ఇప్పుడు, ప్రపంచంలోని ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ప్రారంభంలో, తన వ్యక్తిగత పొదుపుతో కంపెనీ స్థాపనకు మద్దతు ఇచ్చిన సుధామూర్తి, 25 సంవత్సరాలకు పైగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు ఛైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2021 డిసెంబర్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా దాతృత్వ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల రాజ్యసభకు ఎంపికయ్యారు.




















