Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Adilabad News | సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ అధిష్టానంపై కోపంగా ఉన్నారు. తాను తెస్తున్న నిధులను అడ్డుకోవడం, పార్టీలో ప్రాధాన్యత తగ్లడంతో ఒంటరి పోరాటం చేస్తా అన్నారు.

Koneru Konappa Politics | సిర్పూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సంచలనం అంటే సిర్పూర్ (Sirpur) నియోజకవర్గానిదే.. ఎప్పుడు ఏది జరిగినా రాష్ట్రవ్యాప్త చర్చకు దారి తీస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.. రాజకీయపరంగా ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచనాలకు దారి తీస్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు బయటపెట్టినట్లయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు. సొంత పార్టీలోనే అసమ్మతి రాజుకోవడంతో కోనప్పా మండిపడుతున్నారు.
ఆయన కోపానికి కారణాలు ఇవేనా..
తాను చెప్పిన పనులతో పాటు గతంలో నియోజకవర్గానికి తాను తీసుకువచ్చిన పనులు సైతం రద్దు చేస్తుండటం ఆయన కోపానికి ఆజ్యం పోసినట్లయ్యింది. దీంతో ఏం చేయాలనే విషయంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు ఇటివలే ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత బీఎస్పీ పార్టీలో చేరి, ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని అటు నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆ పార్టీలోనే ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు.. స్థానికుడైన ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం ఇక్కడ రాజకీయంగా పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, దండే విఠల్ మధ్య ప్రచ్ఛనయుద్ధం సాగుతోంది.
ఆయనకు పుండు మీద కారం
నిన్న మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న కోనేరు కోనప్ప, ఆయన అల్లుడు శ్రీనివాస్ కలిసిపోయినా.. దండే విఠల్ రూపంలో కోనప్పకి కాంగ్రెస్ లో అడ్డంకిగా మారారు. కోనప్ప రాజకీయంగా ముందుకు సాగాలని చూసినా దండే విఠల్ కు పదవి ఉండటం, కోనప్పకి అలాంటిదేమీ లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. ఇక ఇదంతా ఒక్కెత్తు కాగా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో విడుదల చేయించిన నిధులు, అభివృద్ధి పనులను సైతం రద్దు చేయించడం ఆయనకు పుండు మీద కారం చల్లినట్లైంది. వీటన్నంటిని గమనించిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీనీ వీడేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల ఓ సభలో తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ నిర్ణయమైనా ప్రజల ముందే తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడిలా వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా వెంట ఉంటూ నన్నే ముంచిన ఘటాలు ఉన్నారని అన్నారు. గుడిపేట, వీర్ధండి బ్రిడ్జి నిర్మాణానికి ప్రజలు ఉద్యమం చేయాలన్నారు. పదవిలో ఉన్న నాయకులు మీ ఊరికి వస్తే నిలదీయండంటూ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ కు దగ్గరయ్యే ఛాన్స్
కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉందంటూ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలే కేస్లాపూర్ నాగోబా జాతరకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి వచ్చి నాగోబాను దర్శించుకున్నారు. అప్పుడే ఈ విషయం తేటతేల్లైంది కానీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటివలే ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటల్లో రెండు, మూడు సార్లు కేసీఆర్ ను పొగడడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అందులో ఉన్న మంత్రులు, నాయకులను తిట్టడం దానికే సంకేతం అని పలువురు స్పష్టం చేస్తున్నారు.
కేసీఆర్ దేవునిలా వంతెనలు, రోడ్లు మంజూరు చేశారని ఆయన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అదే సమయంలో కేసీఆర్ దయతోనే ఈ ప్రాంత రైతులకు వేల సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు ఇప్పించగలిగానని చెప్పుకొచ్చారు. ఇలా కేసీఆర్ ను పొగుడుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ తాను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్న సమయంలో కోనేరు దారెటు..? అనేది కొద్ది రోజుల తర్వాత కానీ తెలియదు..!
______________
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

