Nagarjuna Sagar: తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి కేటాయింపులు - ఏపీ, తెలంగాణకు ఎన్ని టీఎంసీలంటే?
Water Allocations: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ.. నాగార్జున సాగర్ నుంచి ఏపీ, తెలంగాణలకు తాగునీటి కోసం కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు కేటాయించింది.
Water Allocations From Sagar To Telugu States: నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) నుంచి తాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నీటి కేటాయింపులు చేసింది. ఈ మేరకు తెలంగాణ (Telangana) 8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లోని బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయిపురే, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. 2 గంటలకు పైగా సాగిన భేటీలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాదోప వాదనలు చోటు చేసుకున్నాయి. సాగర్ నుంచి 14 టీఎంసీలు కావాలని ఏపీ కోరగా.. 10 టీఎంసీలు కావాలని తెలంగాణ డిమాండ్ చేశాయి. వీటిని కమిటీ తిరస్కరించింది. కాగా, గతేడాది అక్టోబర్ లో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో శ్రీశైలం, సాగర్ ల నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించిన నేపథ్యంలో ఈ కోటా నీటి వినియోగంపై పరస్పరం ఆరోపణలతో వాడీ వేడీగా చర్చ సాగింది.
ఏపీ వాదన ఏంటంటే.?
సాగర్ నుంచి తెలంగాణకు అక్టోబర్ లో కేటాయించిన కోటా కన్నా 11 టీఎంసీలు ఎక్కువగా వినియోగించుకుందని ఏపీ అధికారులు ఆరోపించారు. ఇప్పుడు అదనంగా 10 టీఎంసీలు అడగడం సరి కాదని అన్నారు. ఇదే సమయంలో తాము కేటాయింపుల కంటే తక్కువగానే వాడుకున్నామని, ఇంకా 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని గుర్తు చేశారు. ఏపీ ఆరోపణలపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 'రాష్ట్ర పరిధిలో కృష్ణా పరీవాహకంలో ఎక్కువ జనాభా ఉంది. భాగ్యనగరంతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలు బేసిన్ పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో 2 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు ముడిపడి ఉన్నాయి. ఏపీలో బేసిన్ పరిధిలో 17 లక్షల జనాభాకే తాగునీరు అందాల్సి ఉంది.' అని పేర్కొన్నారు. సాగర్ జలాలను తాము తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకున్నామని స్పష్టం చేసింది.
ఏపీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని.. రాష్ట్రవ్యాప్తంగా చెరువులన్నీ ఎండిపోయాయని అధికారులు వెల్లడించారు. దీంతో పంటలకు విరామం ప్రకటించామని అన్నారు. పులిచింతల కింద ఇబ్బందులు ఉన్నాయని.. ఆ జలాశయానికి నీటిని విడుదల చేయాలని కోరారు. సాగర్ నుంచి విడుదల చేసిన నీటిని కాలువలపై మోటార్లు పెట్టి చెరువుల్లోకి ఎత్తిపోసుకుంటున్నామని, ఆ నీటినీ తాగునీటి అవసరాల కోసం వినియోగించుకుంటున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన తెలంగాణ అధికారులు.. సాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేయగా.. కాలువ పొడవునా బందోబస్తు ఏర్పాటు చేసి మోటార్లతో తోడకుండా చర్యలు చేపట్టామని వివరించారు. ఏపీ మాత్రం కాలువల్లో నీటిని చెరువుల్లోకి ఎత్తిపోస్తోందని ఆరోపించారు. ఏపీ తాగునీటి అవసరాల పేరుతో ఈ ఏడాది 200 టీఎంసీలను తరలించిందని.. ఆ నీటిని సాగుకు వినియోగిస్తోందని అన్నారు. పులిచింతల నుంచి ఈ ఏడాది 57 టీఎంసీల మేర ఏపీ వినియోగించిందని.. ఇప్పుడు మళ్లీ నీళ్లు అడుగుతోందని ఆక్షేపించారు.
కృష్ణా బోర్డు సూచనలు
తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. సాగర్ నుంచి గరిష్టంగా నీటిని తోడుకునే స్థాయి 510 అడుగులు కాగా.. 500 అడుగుల స్థాయి నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయంలో 510.53 అడుగుల వద్ద 132.86 టీఎంసీలు ఉన్నాయి. 500 అడుగుల పైన 17.55 టీఎంసీలు అందుబాటులో ఉండనున్నాయి. మే నెల వరకూ ఇరు రాష్ట్రాలు అవసరాలకు 14 టీఎంసీలను వాడుకోవాలి. మిగిలిన 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించాలని తెలిపింది. అదే సమయంలో శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదలకూడదని త్రిసభ్య కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. మే నెలలో మరోసారి సమావేశం నిర్వహించి అప్పటి పరిస్థితులను అంచనా వేయనున్నారు.