Kaushik Reddy and Arekepudi Gandhi : రేవంత్ ఓ పనికిమాలిన నాయకుడన్న కేటీఆర్, నాలుక కోస్తామని జగ్గారెడ్డి హెచ్చరిక
Hyderabad: రేవంత్ రెడ్డి వంటి నాయకుడి వల్లే హైదరాబాద్‌లో ఘర్షణలు జరుగుతున్నాయని కేటీఆర్ విమర్శిస్.... కారణం మీరేనంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. దీంతో కౌశిక్, గాంధీ వివాదం మరో మలుపు తిరిగింది.
KTR Vs Congress: కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదం సద్దుమణిగినట్టే అనుకున్నారు కానీ ఇప్పుడు మరో రూపంలో రాజకీయాలను షేక్ చేస్తోంది. ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కేటీఆర్ ఉదయం కౌశిక్‌రెడ్డిని పరామర్శించారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చేసిన కామెంట్స్ వివాదంపై పెట్రోల్ పోసినట్టు అయింది.
తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని ఆరోపించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి,రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిండని విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి చేరి కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతారని తీవ్రమైన కామెంట్స్ చేశారు.
పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుంచి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారని అన్నారు కేటీఆర్. అయితే హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైందన్నారు. ఫిరాయింపులపై స్పీకర్‌ని కలిసి సుప్రీంకోర్టు తీర్పలను సైతం ఉటంకిస్తూ ఫిర్యాదు చేసినమన్నారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసిందే కౌశిక్ రెడ్డి అని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బతికించే తీర్పు చెప్పిన హైకోర్టు జస్టిస్‌కి బీఆర్ఎస్ పార్టీ తరపున కృతజ్ఞతలు చెప్పారు కేటీఆర్. ఆ తీర్పు వచ్చిన రోజునే అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించారని వివరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపడి చావు డప్పులు కొట్టండి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కారన్నారు. దాన్ని ప్రశ్నించిన వ్యక్తిపై పోలీసుల అండతో దాడికి దిగారన్నారు.
పదేళ్లు గూండాగిరి లేదు
ఇలాంటి గూండాగిరి పదేళ్లలో ఎప్పుడు లేదన్నారు కేటీఆర్. ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా వచ్చారన్నారు వివరించారు. చేతగాని ముఖ్యమంత్రి వల్లనే ఇదంతా జరుగుతుందన్నారు. రేపు జరగరానిది జరిగితే ఎవరు భాద్యత వహిస్తారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పటికైన చెప్పాలన్నారు.
గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. పనికిమాలిన నాయకుడి రేవంత్ వల్లే ఇలాంటవి జరుగుతున్నాయన్నారు. పైశాచిక ఆనందం కోసమే ఇదంతా రేవంత్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇవన్నీ తిరిగి రేవంత్ కి తిరిగి చుట్టుకుంటాయని హెచ్చరించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు.
చేతగాని సీఎం వల్లే ఈ పరిస్థితి
దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలమైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపికి డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అర్థరాత్రి వరకు తిప్పితే తెలంగాణ ప్రజలు వెంట ఉండి కాపాడారన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలంగాణ ప్రజల పౌరుషం చాటారని చెప్పుకొచ్చారు. తమ నేతలను హౌజ్ అరెస్ట్ చేసి గాంధీకి రక్షణ కల్పించి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి పంపించారన్నారు. ఆయన్నే హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావు అన్నారు.
హైదరాబాద్‌లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేసామన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు అందరు తమ వారే అన్నారు. ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు ఇప్పుడు ఉండవున్నారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు.
కేటీఆర్‌కు కాంగ్రెస్ నేతల కౌంటర్
కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మంత్రులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొట్టడం వల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని అన్నారు. అసలు రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ సక్రమంగానే ఉందన్నారు. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ నేతలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఇకపై రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మాత్రం నాలుకలు కోస్తామంటు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఓ వైపు వినాయ నిమజ్జనం చూస్తూనే ఇలాంటి పొలిటికల్ పంచాయితీల్లోనూ కలగజేసుకోవాల్సి వస్తుందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... అసలు ఫిరాయింపులకు ఊతమిచ్చిందే బీఆర్ నాయకులని అన్నారు. మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని పదే పదే కామెంట్స్ చేయడం విరుగుడు చర్యలు చేపట్టాల్సి వచ్చిందన్నారు.