
T Congress Leaders Arrest: గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత - నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
T Congress Leaders Arrest: కాంగ్రెస్ వార్ రూంపై పోలీసుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ గాంధీ భవన్ వద్ద చేపట్టిన ధర్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమలోనే పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు.

T Congress Leaders Arrest: హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూం కార్యాలయంపై పోలీసుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు వివిధ ప్రాంతాల్లో ధర్నాకు దిగారు. గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయలు దేరగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ గేటు దగ్గర బారికేడ్లను పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాను అడ్డుకునే క్రమంలోనే పోలీసులు నేతలను అరెస్ట్ చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై కేసీఆర్ పోలీసుల అప్రజాస్వామిక దాడిపై సిరిసిల్లలో నిరసన తెలిపిన కాంగ్రెస్ సైన్యం! #StopPolticalRepression pic.twitter.com/M3nY0D5kr9
— Telangana Congress (@INCTelangana) December 14, 2022
అసలేం జరిగిందంటే..?
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయంపై మంగళ వారం సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్ కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్ టాప్ లు సీజ్ చేశారు పోలీసులు. సీఎం కేసిఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపణలతో పోలీసులు కార్యాలయానికి సీజ్ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది బయటకు పంపించారు పోలీసులు. కొంత కాలంగా ఎస్కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నోటీసులు ఇవ్వకుండా కార్యాలయాన్ని సీజ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. సునీల్ ఆపన్నహస్తం పేరిట రెండు ఫేస్ బుక్ పేజ్ లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కుట్ర పూరితంగా సీజ్ చేశారు- కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయాన్ని కుట్ర పూరితంగా సీజ్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు చర్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంపై పోలీసుల దాడి, సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా కార్యాలయాన్ని తనిఖీ చేస్తారని నేతలు నిలదీశారు. పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదంతో సునీల్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్..
కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయంపై పోలీసులు మఫ్టీలో వచ్చి ఆకస్మికంగా దాడి చేసి, సీజ్ చేయడం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో కాంగ్రెస్ వ్యవహారాలు జరుగుతాయని, కానీ ఇక్కడ తమకు సంబంధించిన ఆఫీసులో పోలీసుల పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం అన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్బంధం అలాగే కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురి అవుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

