Palamuru Rangareddy Lift Irrigation : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రెడీ - ప్రత్యేకతలు ఇవే !
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
![Palamuru Rangareddy Lift Irrigation : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రెడీ - ప్రత్యేకతలు ఇవే ! CM KCR will launch the Palamuru and Ranga Reddy project on Saturday. Palamuru Rangareddy Lift Irrigation : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రెడీ - ప్రత్యేకతలు ఇవే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/54dee69bb9991825b5a708fd7adefa431694781802661228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Palamuru Rangareddy Lift Irrigation : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్ వద్ద బటన్ నొక్కి బాహుబలి పంప్ ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోయనున్నారు. నీటిని వందల మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉపయోగించిన మహాబాహుబలి మోటర్లకు ఎక్కడా అంతరాయం కలుగకుండా కొత్త విద్యుత్తు వ్యవస్థనే ఏర్పాటు చేశారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి ఒకవైపు నుంచి విద్యుత్తు నిలిచిపోయినా.. మరో దిశ నుంచి కరెంట్‌ను అందించడం ద్వారా.. నిరంతరాయంగా ప్రాజెక్టును నడిపించేలా ఏర్పాట్లు చేసింది.
బాహుబలి మోటార్లు రెడీ
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో నీటిని ఎత్తి పోయడానికి భారీ మోటర్లను ఉపయోగిస్తున్నారు.. ఒక్కో మోటరు పంపు సామర్థ్యం 145 మెగావాట్లు.. ఇలాంటివి ఏకంగా 34 మోటరు పంపులు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజులపాటు.. 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి సామర్థ్యం ఉన్న మోటరు పంపులతోపాటు.. మొత్తంగా రూ.35 వేల కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నడిపేందుకు అదే స్థాయిలో భారీగా విద్యుత్తు అవసరం. 6 దక్షిణ తెలంగాణ జిల్లాలకు, 19 నియోజకవర్గాలకు, 70 మండలాల్లో 1226 గ్రామాలకు కృష్ణా నీళ్లు తరలనున్నాయి.
పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు ప్రయోజనం
.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు,రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు.. మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, మొత్తం 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు అందించడానికి ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. నార్లాపూర్ వద్ద 8.51 టిఎంసిలు, ఏదుల వద్ద 6.55 టిఎంసిలు, వట్టెం వద్ద 16.74 టిఎంసిలు, కరివెన వద్ద 17.34 టిఎంసిలు, ఉద్దండాపూర్ వద్ద 15.91 టిఎంసిలు, లక్ష్మిదేవిపల్లి వద్ద 2.80 టిఎంసిలు నిలువ సామర్థ్యంతో 6 జలాశయాలను ప్రతిపాదించారు. ప్రాజెక్టుపై వేసిన కోర్టు కేసుల కారణంగా పనులను రెండు దశలలో పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. మొదటి దశలో తాగునీటి సరఫరా పనులు, రెండో దశలో సాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.తాగునీటి సరఫరా పనులు పూర్తి అయ్యాయి.
400 కేవీ సబ్‌స్టేషన్లు, విద్యుత్తు లైన్లు..!
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి విద్యుత్తు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ట్రాన్స్‌కో భారీ ఏర్పాట్లుచేసింది. ఎత్తిపోతల పథకం నడపడానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాలి. ట్రాన్స్‌కో ఆ మేరకు ఏర్పాట్లుచేసింది. ఈ ఎత్తిపోతల పథకంలో ఏదుల సబ్‌స్టేషన్ కీలకమవుతుంది. అంటే చౌరస్తా లాంటిదన్నమాట. భారీ సామ ర్థ్యం ఉన్న మోటరు పంపులను వినియోగిస్తున్నందున.. వాటిని నడిపించేందుకు అదేస్థాయిలో ఉండే పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. దక్షిణ తెలంగాణలోని ముఖ్యమైన పాలమూరు, రంగారెడ్డి ప్రాంతాల్లో సాగు, తాగు నీటిని అందించడంతోపాటు, పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని అం దించే ఈ కీలకమైన ఎత్తిపోతల పథకాన్ని నిర్దేశించిన లక్ష్యంమేరకు నడిపించేలా విద్యుత్తు సరఫరా వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించామని ప్రభుత్వం ప్రకటించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)