Sun Temple of Konark : ఈ ఆలయంలో ప్రతి శిల్పం ఓ పాఠం చెబుతుంది, రథ సప్తమి స్పెషల్
రథసప్తమి స్పెషల్: 12ఏళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించారు కోణార్క్ దేవాలయం. సూర్యుడి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులు మాత్రమే కాదు ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన అద్భుతమైన విజ్ఞాన గని..
Sun Temple of Konark : 13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని, వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్నా అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటోంది. వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విఙ్ఞానాన్ని అందిస్తోంది కోణార్క్ ఆలయం.
మొదటి దశలో విజ్ఞానాన్ని అందించే శిల్పాలు
నేలకు రెండు అడుగుల ఎత్తులో అంటే పిల్లలకు కనిపించే విధంగా ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులు వాటి విన్యాసాలు కనిపిస్తాయి. బొమ్మలతో పాటూ వాటి ఆహారపు అలవాట్లు కూడా దర్శనమివ్వడం పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి. ఈ బొమ్మలకు పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం, కుస్తీ లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు చూపుతిప్పుకోనివ్వకుండా ఉంటాయి. ఇంకా... రాజకీయం, యుద్ధ కళలు, రాజ్య పాలన, శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకి పదును పెడతాయి.
Also Read: జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం - వసంత పంచమి ప్రత్యేకత
రెండో దశలో కామసూత్ర భంగిమలు
ఈ విగ్రహాలు అన్నింటిపైనా చెక్కిన కామసూత్ర భంగిమలు యవ్వనంలో ఉండేవారికి పాఠాలు నేర్పిస్తాయి. హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియజేస్తాయి.
మూడో దశలో మోక్షాన్ని సూచించే శిల్పాలు
ఈ దశ దాటిన తర్వాత పైకి దృష్టి మరల్చితే దేవతా మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఎలాంటి ఆకర్షణలకూ, మోహానికి లొంగిపోకుండా మనసును నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడమే వీటి పరమార్థం.
Also Read: సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే!
అహంకారం, పొగరు ఉంటే పతనం తప్పదనే సందేశం
ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే, ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లు కనిపిస్తుంది. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం, ఏనుగు ధనానికి ప్రతీక, ఈ రెండూ మనిషికి ఉంటే పతనం తప్పదనేది ఈ శిల్పం సందేశం. 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికీ, బలానికీ ప్రతీకలుగా చెబుతారు. ఇక రథంలా ఉండే ఈ ఆలయానికి ఉన్న 24 చక్రాలు ఏదో అందానికి చెక్కారనుకుంటే పొరపాటే... అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయి. రథాన్ని లాగుతున్నట్టు రూపొందించిన ఏడు గుర్రాలు ఏడు రోజులకు, సూర్య రశ్మిలో రంగులకు ప్రతీక అంటారు.
కోణార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది. కోన అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైంది. ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు. 1884 సంవత్సరంలో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చారు. ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల వరుస ఉంది. ఈ 24 చక్రాలు గంటలను సూచిస్తాయని చెబుతారు. 10 రూపాయల నోటులో కనిపించే చక్రం ఇదే. ఒడిశాలో పూరీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ దేవాలయాన్ని గంగా వంశానికి చెందిన నర్సింహదేవ (1236-1264) నిర్మించారు.