Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
KCR: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయాలన్నారు.

Telangana Latest News: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణ కవచంలా ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం జరిగిన కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు 8 గంటలపాటు జరిగిన భేటీలో అనేక విషయాలు చర్చించారు. తెలంగాణ ప్రజలకు పాలనా పరిరక్షణను అందించగల పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని తేల్చారు. గత పద్నాలుగు నెలు కాంగ్రెస్ అందిస్తున్న పాలనతో మరోసారి రుజువైందని తెలిపారు. కాంగ్రెస్ పాలనపై తెలంగాణ సమాజంలో, ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొందని అభిప్రాయపడ్డారు.
బీఆర్‌ఎస్‌పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ నాటికి పాతికేళ్లు పూర్తి అవుతుందని గుర్తు చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా నిర్వహించే సిల్వజూబ్లీ వేడుకలను ఘనంగా ఉండాలని సూచించారు. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలన్నారు కేసీఆర్. ఈ సభకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలు పరిశీలించాలని లీడర్లకు సూచించారు. వీలైన త్వరగా వేదిక ఖరారు చేయాలని తెలిపారు.
కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ..."దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలన దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నాం. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం నేడు మోసపోయి గోస పడుతోంది." అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
ప్రజలు గోస పడుతున్న ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు బీఆర్‌ఎస్‌కే పరిమితం కాకూడదని యావత్ తెలంగాణ సమాజానికి భాగం ఉండాలని ఆకాంక్షించారు.
"బి ఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. ప్రజలు బిఆర్ఎస్‌ను తెలంగాణ పార్టీగా తమ ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. వారి రక్షణ బిఆర్ఎస్‌పార్టీనే అని నమ్ముతున్నారు." అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ఆశ పెట్టిన గ్యారెంటీలను, వాగ్ధానాలను నమ్మిన ప్రజలు నేడు నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని అన్నారు కేసీఆర్. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్బంగా వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షల మంది తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.
బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీనీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచాలన్నారు. ఆ దిశగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు అధినేత వివరించారు.
పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. రాష్ట్రంతోపాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన డిస్కషన్ చేశారు.
గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు కేసీఆర్. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా తెలంగాణకు వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. రాష్ట్రంలో పార్టీనీ పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాలని సమావేశం భావించింది.
తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిథ్యం పార్లమెంటులో లేకపోవడంతో తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని అంశంపై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్ధమయ్యేలా చెప్పాలన్నారు కేసీఆర్. పార్లమెంటులో బిఆర్ఎస్ ఎంపీలు ఉండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పలు అంశాలపై చర్చ సందర్భంగా కేసీఆర్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలో.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులు తిప్పి కొడుతూ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?





















