Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
Telangana Latest News: ఆర్థిక కష్టాలు, రాజకీయ ఒత్తిళ్లతో ఉన్న రేవంత్ సర్కారు వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. కేంద్రంతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఆల్‌పార్టీ ఎంపీలతో సమావేశంకానుంది.

Telangana Latest News: పదో తేదీ నుంచి మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశల్లో కీలకమైన బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే పార్టీ, రాష్ట్రాలు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. తెలంగాణ కూడా అదే ప్లాన్‌తో సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటాయనే చర్చ మొదలైంది.
తెలంగాణకు సంబంధించిన చాలా అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటి సాధన కోసం ఇప్పటికే పలు మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. మంత్రులతో మాట్లాడారు. అయినా కొన్ని పరిష్కారం కాలేదు. అందుకే ఇప్పుడు ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఆల్ పార్టీ ఎంపీలతో సమావేశం అవుతోంది.
శనివారం ప్రజాభవన్‌లో అన్ని పార్టీల ఎంపీలతో కాంగ్రెస్ ప్రభుత్వం సమావేశం కానుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధన ఎజెండాగా ఈ భేటీ సాగనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించనున్నారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఎంపీలు రాష్ట్రం పక్షాన పార్లమెంట్‌లో గళం విప్పేలాని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు ఎలాంటి వ్యూహాన్ని రెడీ చేయాలో చర్చిస్తారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
శనివారం జరిగే కీలకమైన సమావేశానికి హాజరుకావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికి సమాచారం అందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి ప్రతి ఒక్కర్నీ ఆహ్వానించారు.
ఇన్ని రోజులు కాంగ్రెస్ ఎంపీలకు నిధులు తీసుకురావడం చేతకావడం లేదు అంటూ విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తిగా మారింది. ఈ సమావేశానికి ఆ రెండు పార్టీల ఎంపీలు వస్తారా రారా అనేది ఆసక్తిగా మారుతోంది.
నిధుల సాధనకు ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా విధాలుగా ప్రయత్నించారు. ఈ మధ్య కూడా ప్రధానమంత్రి మోదీతో సమావేశమై పెండింగ్ సమస్యలపై చర్చించారు. కానీ ఆయన నుంచి అనూహ్యంగా ఎదురు ప్రశ్నలు వచ్చాయి. ఆయన కూడా ఓ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చి రాష్ట్రంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యల చిట్టాను రేవంత్ ముందు ఉంచారు. ఇప్పటి వరకు ఏ సీఎంకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు.
ప్రధానికి రాష్ట్ర సమస్యలు చెప్పేందుకు వెళ్లిన రేవంత్‌కు మోదీ నుంచి అనూహ్యమైన అనుభవం ఎదురు కావడంతో ఆయన వ్యూహం మార్చారు. ఇప్పుడు కలిసికట్టుగా వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తున్నారు. అందర్నీ సమావేశాలకు పిలిస్తే వచ్చిన పార్టీలతో ముందుకెళ్తామని కాంగ్రెస్ చెబుతోంది. రాని పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ద్రోహం చేసిన వాళ్లు అవుతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
రెండు ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో పై చేయి సాధించిన బీజేపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు ఇదో మంచి అవకాశంగా కాంగ్రెస్ ఎత్తు వేసింది. ఇద్దరు కేంద్రమంత్రులు, మిగతా ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై గళమెత్తాలని కాంగ్రెస్ కోరుతోంది. అందుకే ఈ సమావేశానికి హాజరై ప్రభుత్వం చెప్పేది వినాలని సూచిస్తున్నారు. రాకుంటే మాత్రం వారి తీరును ప్రజల్లోనే ఎండగడతామని హెచ్చరిస్తున్నారు.
Also Read: బిల్లులు మంజూరుకు కమిషన్లు అడుగుతున్నారు - భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన





















