Telangana News: బిల్లులు మంజూరుకు కమీషన్లు అడుగుతున్నారు - భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన
Hyderabad: మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ఎదట కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. బిల్లులు చెల్లించాలంటే 20 శాతం కమిషన్ అడుగుతున్నారని అంటున్నారు.

Mallu Bhatti Vikramarka: తెలంగాణ సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు కొంత మంది ఆందోళన చేయడం కలకలం రేపింది. ఆర్థిక మంత్రిగా కూడా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ముందు వీరు ధర్నాకు దిగారు. వివిధ జిల్లాల నుంచి దాదాపుగా రెండు వందల మంది కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు. ఆర్థిక మంత్రిని కలిసేందుకు వచ్చామని చెప్పి ఆయన చాంబర్ వద్దకు వెళ్లారు. అయితే భట్టి విక్రమార్క అప్పటికే వెళ్లిపోయారు. దాంతో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోవాలని సూచించారు. కానీ వారు వెళ్లకుండా ఆందోళనకు దిగారు. బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20 శాతం కమిషన్ అడుగుతున్నట్లు వారిలో కొంత మంది ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు
భారత రాష్ట్ర సమితి హయాంలో కాంట్రాక్టర్లు పనులు చేశారు. అయితే బిల్లులు చెల్లించలేదు. అప్పటి నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్లుగా తమ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వడ్డీలు కట్టుకోలేకపోతున్నామని వారంటున్నారు. ఎప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించినా నిధులులేవంటున్నారని కానీ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు కానీ తమకు ఇవ్వడానికి లేవా అని అడుగుతున్నారు.
కమిషన్ల ఆరోపణల వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్న కాంగ్రెస్ నేతలు
అయితే కాంట్రాక్టర్లు అందరూ ప్రణాళిక ప్రకారం దుష్ప్రచారం చేయడానికి ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చారని వారంతా బీఆర్ఎస్ సానుభూతి పరులని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. కొద్ది రోజులుగా మల్లు భట్టి విక్రమార్కపై సోషల్ మీడియాలో పర్సంటేజీల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో మరింత ప్రణాళికా బద్దంగా ప్రచారం చేయడానికే కాంట్రాక్టర్ల పేరుతో కొంత మందిని సెక్రటేరియట్ కు పంపారని అంటున్నారు. వీరి ఆందోళనకు భయపడి మల్లు భట్టి విక్రమార్క వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారని .. నిజానికి ఆయన ఉదయం.. సెక్రటేరియట్ కు వచ్చిన కాసేపటికే వెళ్లిపోయారని అంటున్నారు. చాంబర్ లో లేరని తెలిసి కూడా రావడం వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది.
కాంట్రాక్టర్ల బ్యాక్ గ్రౌండ్ ఆరా తీస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వ వర్గాలు కూడా వచ్చిన కాంట్రాక్టర్లు ఎవరు.. వారు లోపలికి ఎలా వచ్చారు.. వారిలో నిజంగా ఎంత మంది కాంట్రాక్టర్లు ఉన్నారో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. సో,,।।ల్ మీడియా, మీడియాల్లో ప్రచారం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని అంటున్నారు. తప్పుడు బిల్లులు పెట్టి అవినీతికి పాల్పడిన వారి బిల్లులు మాత్రమే పెండింగ్ లో ఉంటాయని.. వారు తమ బిల్లలు చెల్లించేలా ఒత్తిడి చేసేందుకు ఇలాంటి ఆందోళనలతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు.



















