Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Musk: అమెరికా స్టాక్ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ కంపెనీ షేర్ల వాల్యూ దారుణంగా పడిపోతోంది. ఈ కారణంగా ఆయన నెట్ వర్త్‌లో ఒక్క నెలలోనే 90 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

Elon Musk Net Worth Drops: ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. కానీ ఈ ఏడాది ఆయన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ ను గెలిపించి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టానని ఆయన అనుకుంటున్నారు కానీ.. అత్యంత గడ్డు పరిస్థితిని ఆర్థికంగా ఎదుర్కొంటున్నారు. ఆయన మెయిన్ కంపెనీ టెస్లా షేర్ వాల్యూ దారుణంగా పడిపోతోంది. ఈ ఏడాది జనవరి చివరికి 486 బిలియన్ డాలర్ల నికర విలువ ఉన్న ఆయన నెట్ వర్త్ ఇప్పుడు 90 బిలియన్ డాలర్లను కోల్పోయారు.
మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత మెటాకు చెందిన మార్క్ జుకర్‌బర్గ్ , అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ ఆస్తుల నికర విలువ ప్రస్తుతం 351 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం జనవరి , ఫిబ్రవరిలో ఎలోన్ మస్క్ ఆస్తుల్లో 81 బిలియన్ల తగ్గుదల నమోదు అయింది. స్పేస్‌ఎక్స్ హోల్డింగ్‌లలతో పాటు టెస్లా, ట్విట్టర్, xAI, ది బోరింగ్ కంపెనీ మరియు న్యూరాలింక్‌లలో భారీగా వాటాలు ఎలాన్ మస్క్ దగ్గరే ఉన్నాయి.
డిసెంబర్ 2024లో టెండర్ ఆఫర్ తర్వాత స్పేస్‌ఎక్స్ 350 బిలియన్లకు దగ్గరగా మార్కెట్ వాల్యూ సాధించింది. ఇందులో మస్క్ వాటా విలువ 136 బిలియన్లు. ఆటోమోటివ్ రంగంలో అత్యంత విలువైన కంపెనీ అయిన టెస్లాలో ఎలాన్ మస్క్‌కు 13 శాతం షేర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28, 2025 నాటికి, టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 942 బిలియన్ డాలర్లు. మస్క్ కు ఉన్న షేర్ల విలువ 120 బిలియన్లు ఉంటుంది. ఇక ట్విట్టర్ లో మెజార్టీ వాటా మస్క్ కే ఉంది. ఆయనకు 79 షేర్లు ఉన్నాయి. దీని విలువ 8 బిలియన్ డాలర్లు.
చైనాకు చెందిన డీప్‌సీక్ AI పరిశ్రమలో సంచలనం సృష్టించిన తర్వాత టెస్లా CEO ఎలోన్ మస్క్ నికర విలువ సుమారు 90 బిలియన్లు తగ్గింది. అతని మొత్తం సంపద ఫిబ్రవరి ప్రారంభంలో 433 బిలియన్లు ఉంటే నెలాఖరు నాటికి 349 బిలియన్లకు పడిపోయింది. టెస్లా ఆటోమొబైల్ కంపెనీ షేర్లు 13.4% క్షీణించడంతో ఆ కంపెనీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ నుంచి షేర్ల వాల్యూ 27 శాతం పడిపోయింది. టెస్లా కార్ల అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. అది ఇంకా ఎక్కువగా ఆందోళన పడేలా చేస్తోంది
అమెరికా స్టాక్ మార్కెట్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. చైనాకు చెందిన డీప్ సీక్ ఏఐ టూల్ .. చాట్ జీపీటీకి పోటీగా వచ్చిన తరవాత.. ఇక టెక్ రంగంలోనూ అమెరికా కు చైనా చెక్ పెడుతుందన్న ప్రచారం ఊపందుకుంది. మరో వైపు చైనాకే చెందిన బీవైడీ కంపెనీ.. మస్క్ కు చెందిన టెస్లా కన్నా మెరుగైన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీగా మారుతోందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీవైడీ ఇతర దేశాలకు తన నెట్ వర్క్ ను విస్తరిస్తోంది. ఈ పరిణామాలతో టెస్లా కార్లకు డిమాండ్ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే టెస్లా షేర్లపై ఒత్తిడి ఉన్నట్లుగా భావిస్తున్నారు. మళ్లీ మస్క్ కంపెనీల షేర్లు కోలుకుంటాయా లేదా అన్నదానిపై మార్కెట్ నిపుణులు ఎలాంటి అంచనాలు వేయలేకపోతున్నారు.





















