Weather Latest Update: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే!
తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
ప్రస్తుతం తెలంగాణలో దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇవాళ, అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలలో పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాలకు అసలు వర్షసూచనే లేదని అంచనా వేస్తున్నారు.
శనివారం పరిస్థితి చూస్తే... నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జిల్లాలకు వర్ష సూచన లేదని మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఆదివారం వాతావరణం చూసుకుంటే... కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగామ్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రిభువనగిరి జిల్లాకు వర్ష సూచన లేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.3 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
‘‘ఈసారి జూన్ నెలలో వర్షపాతాలు చాలా దారుణంగా పడిపోయాయి. ఇది రెండో వేసవిలా కొనసాగుతోంది. వేడి వాతావరణం తర్వాత నేడు సాయంత్రానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో పలు భాగాల్లో వర్షాలు విస్తరించనున్నాయి. కానీ ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో, నెల్లూరు జిల్లాలోని పలు దక్షిణ భాగాలు (కృష్ణపట్నం - గూడూరు బెల్ట్), తిరుపతి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు చూడగలం. మిగిలిన చోట్లల్లో తక్కువ వర్షాలే ఉంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.