MLC Elections 2025:ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం-సాయంత్రం 4 వరకు పోలింగ్
MLC elections 2025:తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ 8 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలకు, తెలంగాణలో మూడు స్థానాలకు ఓటింగ్ జరగుతోంది. ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మూడు స్థానాల్లో ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు 973 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. ఈ కేంద్రాలను నేరుగా కంట్రోల్ రూం నుంచే పర్యవేక్షిస్తున్నారు.
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటులో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్ -నిజామాబాద్-ఆదిలాబాద్ -కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. వరంగల్ -ఖమ్మం- నల్గొండ టీచర్స్ స్థానంలో 25,797 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. 19 మంది బరిలో నిల్చొని ఉన్నారు.
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్‌రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి పదవీ కాలం ముగియనుంది. వారి స్థానంలోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ నియోజవర్గాలకు ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నేడు పోలింగ్ జరగనుంది. 6 లక్షల 62 వేల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు చోట్ల దాదాపు 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికారులు 939 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచరర్ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలలో అభ్యర్థిని ఎన్నుకునేందుకు 22,493 మంది ఉపాధ్యా యులు ఓటు వేయనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం 123 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మద్యం షాప్‌లా మారిన ఆక్వా ఫామ్, 180mlతో నర్సాపురం మున్సిపాలిటీ షేక్
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఉదయం 9.05 గంటలకు తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలోని గాదె రామయ్య - సీతారావమ్మ ఎంపీయూపీ స్కూల్‌లో ఓట వేయనున్నారు.
ఎండ తీవ్రంగా ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్స్, ప్రాథమిక చికిత్స వెసులుబాటు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరు గుర్తింపు కార్డు సహా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఓటు వేయబోయే గ్రాడ్యుయేట్స్, టీచర్స్‌కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు కూడా ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారిల్లో గ్రాడ్యుయేట్స్ ఉంటే వారికి ప్రత్యేక సెలవుగా గుర్తించాలని సూచించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ఓట్లను మార్చి 3న లెక్కిస్తారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

