Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్ టూర్‌లో కేటీఆర్
Top Headlines Today: తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్టి షెడ్యూల్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే.
ఈ-ఆటోలు ప్రారంభం
చెత్త సేకరణకు ఉపయోగించే ఈ ఆటోలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభిస్తారు. ఒక్కో ఆటో 4.10 లక్షల రూపాయలతో 516 ఆటోలను 21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టిలకు పంపించనున్నారు. ఒక్కో ఆటో సామర్థ్యం 500 కిలోలు.
కేటీఆర్ మహబూబ్‌నగర్ టూర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తారు. భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇళ్లను స్టార్ట్ చేస్తారు. ఈ టూర్ టైంలో వేముల, మహబూబ్‌నగర్, జడ్చర్లలో కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మహిళా కమిషన్ ముందుకు శేజల్ పంచాయితీ
సంచలనం సృష్టించిన దుర్గం చిన్నయ్య, శేజల్ పంచాయితీ జాతీయ మహిళా కమిషన్ ముందుకు చేరింది. దుర్గం చిన్నయ్య తనను వేధించాడని కొన్ని రోజుల నుంచి శేజల్ ఆరోపిస్తున్నారు. ఈ మధ్య ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ శేజల్‌ను విచారణకు పిలిచింది.
రియల్‌మి 11 ప్రో 5జి సిరీస్
స్మార్ట్ ఫోన్ తయారీదారు రియల్‌మీ 11 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను ఇవాళ విడుదల చేయనుంది. రియల్‌మీ 11 ప్రొ, రియల్‌మీ 11 ప్రో ప్లస్ మోడళ్లు 12 గంటలకు రివీల్ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రీ ఆర్డర్ల లాంచింగ్ కూడా అందిస్తోంది. దీనిలో 6.7 ఇంచ్‌ల కర్వ్‌డ్ డిస్‌ప్లే, 1 టీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది.
'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'భగవంత్ కేసరి' (NBK 108 Movie Titled Bhagavanth Kesari). 'ఐ డోంట్ కేర్'... అనేది ఉప శీర్షిక. ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. జూన్ 8వ తేదీన... అనగా ఇవాళ(గురువారం) టైటిల్ వెల్లడించడానికి ఏర్పాట్లు జరిగాయి. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు (Balakrishna Birthday). దానికి రెండు రోజుల ముందు టైటిల్ వెల్లడిస్తున్నారు. అభిమానులకు రెండు రోజుల ముందు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నారు. అది కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 108 లొకేషన్లలో టైటిల్ అనౌన్స్ చేస్తున్నారు. 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేసేలా ప్లాన్ చేశారు.
పీజీఈసెట్ ఫలితాలు
తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్) -2023 ఫలితాలు గురువారం (జూన్ 8న) విడుదల కానున్నాయి. జూన్ 8న మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టిటాగర్ వేగన్స్: ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా, ఈక్విటీ షేర్లు లేదా ఇతర సెక్యూరిటీలను జారీ చేసి నిధులు సేకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి, ఆమోదించడానికి టిటాగర్ వ్యాగన్స్ డైరెక్టర్ల బోర్డ్ ఈ నెల 10న సమావేశం అవుతుంది.
లెమన్ ట్రీ హోటల్స్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో 60 గదులున్న హోటల్ కోసం లైసెన్స్ ఒప్పందంపై లెమన్ ట్రీ హోటల్స్ సంతకం చేసింది. FY25లో Q3 నాటికి ఈ హోటల్ వ్యాపారం ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
సులా వైన్‌యార్డ్స్: కొత్త CFOను సులా వైన్‌యార్డ్స్ ప్రకటించింది. నాసిక్‌లో ఉన్న ఐకానిక్ బియాండ్ రిసార్ట్‌లో (Beyond resort) మూడు కొత్త లగ్జరీ విల్లాలను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
హాట్సన్ ఆగ్రో: కంపెనీకి చెందిన విండ్‌మిల్ విభాగాన్ని విక్రయించడానికి హ్యాట్సన్ ఆగ్రో డైరెక్టర్ల బోర్డు వచ్చే నెల 5న సమావేశం అవుతుంది. ఆ విభాగానికి సంబంధించిన అన్ని ఆస్తులు, అప్పులను స్లంప్ సేల్ ప్రాతిపదికన బదిలీ చేస్తుంది.
విప్రో: ప్రైవేట్ 5G-యాజ్-ఎ-సర్వీస్ సొల్యూషన్స్‌ను విప్రో & సిస్కో లాంచ్ చేశాయి. కంపెనీల డిజిటల్ ఫార్మేషన్‌ను ఈ కొత్త సర్వీస్ వేగవంతం చేస్తుంది.
టాటా ఎల్‌క్సీ: రాబోయే గగన్‌యాన్ మిషన్ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌తో (ఇస్రో) టాటా ఎల్‌క్సీ ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్ మిషన్ రికవరీ టీమ్ శిక్షణ కోసం టాటా ఎల్‌క్సీ క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్‌ను (CMRM) డిజైన్ చేసి, రూపొందిస్తుంది.
పంజాబ్ & సింధ్ బ్యాంక్: బాసెల్-111 కంప్లైంట్ అడిషనల్ టైర్-1 బాండ్లు లేదా టైర్-IT బాండ్లను జారీ చేసి రూ. 750 కోట్ల వరకు మూలధనాన్ని సమీకరించే ప్రతిపాదనను పరిశీలించేందుకు బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 12న సమావేశం అవుతుంది. ఈ బాండ్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో 12 నెలల్లోపు జారీ చేయాలన్నది ప్రతిపాదన.
జైడస్ లైఫ్: తడలఫిల్ టాబ్లెట్‌లను అమెరికాలో మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి జైడస్ లైఫ్ సైన్సెస్‌కు తుది ఆమోదం లభించింది.
డి-లింక్ ఇండియా: ఏస్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా బుధవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా, స్మాల్ క్యాప్ కంపెనీ డి-లింక్ ఇండియాలో కొంత వాటాను అమ్మేశారు.
టెక్ మహీంద్ర: భారతదేశంలో అతి పెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్లలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), IT సేవల సంస్థ టెక్ మహీంద్రలో తన వాటాను పెంచుకుంది.