Maha Kumbh Mela 2025 : గంట గంటకూ ఓ రైలు - రెండో పవిత్ర స్నానానికి సిద్ధమైన మహా కుంభమేళా 2025 - భక్తుల కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
Chandauli: జనవరి 29న మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రైల్వే అనేక ఏర్పాట్లు చేసింది.

Maha Kumbh Mela 2025: ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా సాగుతోన్న మహా కుంభమేళా 2025లో రెండో అమృత స్నానానికి సమయం దగ్గర పడింది. జనవరి 29న మౌని అమావాస్య రోజున భక్తులు, సాధువులు, ఇతర సన్యాసులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయనున్నారు. ఇందుకోసం ప్రయాగ్ రాజ్ తో పాటు కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఘాట్లలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క భక్తుల సౌకర్యార్థం భద్రత కోసం భారతీయ రైల్వే కూడా హై అలర్ట్ మోడ్‌లో ఉంది. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తుల కోసం రైల్వే వివిధ మార్గాల్లో రైళ్లను నడుపుతుండగా, ప్రయాగ్ రాజ్ చుట్టుపక్కల స్టేషన్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రెండో పవిత్ర స్నానం నేపథ్యంలో రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
అత్యంత రద్దీతో కూడిన స్టేషన్లలో ఒకటైన పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ్ జంక్షన్ వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్యాసింజర్ హాలుతో పాటు స్టేషన్ ఆవరణలో భక్తులకు విశ్రాంతి కోసం హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ఇవి మాత్రమే కాదు ఈ జంక్షన్ లో కుంభమేళా కోసం స్పెషల్ హెల్ప్ బూత్ ను కూడా సిద్ధం చేశారు. ఇక్కడ రైల్వే ఉద్యోగులు 24 గంటలూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ, అవసరమైన సమాచారం అందిస్తారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ జంక్షన్ మీదుగానే ప్రయాగ్‌రాజ్ కు వెళ్లాల్సి వస్తున్నందున ఈ ప్రదేశంలో భారీ రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, తనిఖీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. ఈ జంక్షన్ తో పాటు సమీపంలోని స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
గంట గంటకూ ఓ రైలు
మహా కుంభకుంభ స్నానానికి వెళ్లే వారందర్నీ వీలైనంత త్వరగా స్నానానికి తీసుకెళ్లి, అంతే త్వరగా తిరిగి రప్పించేందుకు ప్రయత్నించడమే తమ మొదటి పని అని ఆర్‌పీఎఫ్ కమాండెంట్ జెతిన్ తెలిపారు. అందుకోసం ప్రతి గంటకు ఒక స్పెషల్ రైలును పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ముఖ్యంగా రెండు విషయాలపై దృష్టి సారించిందన్నారు. అందులో మొదటిది క్రౌడ్ మేనేజ్మెంట్. "దీని కోసం జీఆర్పీతో పాటు అదనపు బలగాలను ఏర్పాటు చేశాం. దీంతో పాటు ప్రయాణికుల సౌలభ్యం కోసం హోల్డింగ్ ఏరియాను సిద్దం చేశారు. అందులో భాగంగా మహిళల కోసం ఏర్పాటుచేసిన టీపీఎఫ్, వృద్దుల కోసం స్కౌట్ గైడ్ లను నియమించాం" అని చెప్పారు. ఇక తాము ఫోకస్ చేసిన రెండో విషయం ఏంటంటే, నేరాలను నియంత్రించడం. "రద్దీ పెరిగేకొద్దీ, నేరాల అవకాశం కూడా పెరుగుతుంది. అందువల్ల, గూఢచార సంస్థలతో సహా మాకు చెందిన నాలుగు బృందాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, స్థానిక పోలీసు ఇంటెలిజెన్స్ బ్యూరో, జీఆర్పీతో కూడా నిఘా పెంచాం. స్టేషన్‌తో పాటు ట్రాక్‌లపైనా గస్తీ తిరుగుతున్నాం. దీంతో పాటు అన్ని స్టేషన్లలో ర్యాండమ్ చెకింగ్ చేస్తున్నాం" అని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

