Delhi Air Pollution: బాబోయ్ మేము ఉండలేం, ఇక్కడి నుంచి వెళ్లిపోతాం - సర్వేలో ఢిల్లీ, ముంబై వాసులు
Air Pollution: న్యూఢిల్లీ, ముంబయిని వాయు కాలుష్యం వణికిస్తోంది. నిత్యం పొగ, ధూళితో అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలనే చూస్తున్నారు.
Delhi, Mumbai Air Quality: దేశ రాజధాని న్యూఢిల్లీ (Delhi), ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయిని(Mumbai) వాయు కాలుష్యం (Air Pollution) వణికిస్తోంది. నిత్యం పొగ, ధూళితో అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలనే చూస్తున్నారు. కాలుష్యం బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారు. ఇంకొంత కాలం ఇక్కడే ఉంటే ప్రాణాలు అదే గాలిలో కలిసిపోతాయనే ఆందోళన వక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల నుంచి బయట పడాలంటే ఇతర ప్రాంతాలకు, కాలుష్యం లేని ప్రదేశాలకు వెళ్లడమే ఇదే సరైన మార్గమని అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ, ముంబై నగరాల్లో నివసిస్తున్న ప్రతి పది మందిలో ఆరుగురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లో కాలుష్యాన్ని తట్టుకోలేక పోతున్నామని, వేరే ప్రాంతాల్లో స్థిరపడదామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్రిస్టీన్ కేర్ (Pristyn Care) అనే సంస్థ తన తాజా సర్వేలో వెల్లడించింది. ఆయా నగరాల్లో నానాటికి వాయు కాలుష్యం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. గాలి నాణ్యత సూచీ సైతం దారుణంగా పడిపోతోంది. కాలుష్యాన్ని పీల్చి ప్రజలు రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాంటే ఆలోచించాల్సి వస్తోందని, ఒక వేళ వెళ్లినా మాస్కులు ధరిస్తున్నామని 30 శాతం మంది సర్వేలో చెప్పారు.
నిరంతరం దగ్గు, శ్వాస ఇబ్బందులు, గురక, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నామని సర్వేలో పలువురు తమ సమస్యలను చెప్పుకొచ్చారు. ప్రతి పది మందిలో 9 మంది ఇవే చెప్పడం గమనార్హం. ఆస్తమా, బ్రాంకైటిస్‌లతో ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్యం శీతాకాలంలో మరింత దిగజారిపోతోందని 40 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు బయటకు వెళ్లడం కూడా తగ్గించేశామని చెప్పారు. గతంలో ఆరోగ్యంగా ఉండేందుకు నడక, వ్యాయామాలు చేసేవాళ్లమని, ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బయటకు వెళ్లడం లేదని దాదపు 35 శాతం మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మెరుగు పడిన గాలి నాణ్యతా సూచి
ఎన్‌సీఆర్ ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు, వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆంక్షలుపై పలు నిర్ణయాలు తీసుకున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల గాలి నాణ్యత సూచీ మెరుగుపడింది. స్వల్పంగా గాలి నాణ్యత మెరుగుపడడంతో పలు ఆంక్షలు సడలించింది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ కార్యచరణపై చర్చించింది. దీంతో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో సహాయపడటానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద మూడో దశ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆయా కార్ల వాహనదారులు ఆంక్షలు సడళించడంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్‌తో సహా జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతిచ్చారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తప్పనిసరిగా ఆంక్షలను అమలు చేయాలని ఆదేశించింది. వాహనాలకు సంబంధించి పీఎస్‌యూ సర్టిఫికెట్లను తనిఖీ చేయాలని పోలీసులకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులకు రూ.20వేల వరకు జరిమానా విధించారు. ప్రభుత్వ డేటా ప్రకారం ఎన్‌సీఆర్ పరిధిలో 36శాతం వాహనాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి.