Ring Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP Desam
శ్రీకాకుళం రింగు వలలో చిక్కిన ఏ చేప కూడా మళ్లీ సముద్రంలోకి పోలేదు. మత్స్యసంపద వృద్ధికి అవసరమైన పిల్లచేపలు కూడా ఈ వలలో చిక్కుకుంటాయి. సంప్రదాయ మత్స్యకారులు చేపల వృద్ధి కోసం చిన్న చేపలను వేటాడరు. రింగు వల వేస్తే మాత్రం చిన్న, పెద్ద తేడా లేకుండా చేపలు పెద్ద సంఖ్యలో చిక్కుతాయి. అవి బయటకు పోలేవు. ఎందుకంటే.. రింగు వల కన్నాలు అంత చిన్నగా ఉంటాయి. చిన్న చేపలైన నెత్తళ్లు వంటివి కిలోమీటర్ల మేర సమూహాలుగా ఉంటాయి. అర కిలోమీటరు నుంచి కిలోమీటరు వ్యాసార్థం వరకు ఉండే నెత్తళ్ల సమూహాలను సైతం ఈ రింగువలలు చుట్టిపడేస్తాయి. కొన్నాళ్లు అదే పనిగా రింగువలలతో ఫిషింగ్ చేస్తే, ఆ ప్రాంతంలో చేపల ఆచూకీ లేకుండాపోతుందని 2005 ఆగస్టు 6న అప్పటి ప్రభుత్వం జీవో 384ను జారీచేసి రింగు వలల వినియోగాన్ని నిషేధించింది. దీనిపైనే ఇక్కడి మాదిరిగానే విశాఖపట్నంలో రింగ్‌వలలు వాడుతున్నవారికి, సంప్రదాయ మత్స్యకారులకు మధ్య యుద్ధమే జరిగింది. తరచుగా వలలు తగులబెట్టుకొని శాంతిభద్రతలకు సమస్యగా కూడా తయారైంది. ఇప్పుడు అటువంటి వాతావరణం ఏర్పడకుండా చూడాల్సిన మత్స్యశాఖ అధికారి స్వయంగా సంప్రదాయ మత్స్యకారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.





















