Telangana News: ఫార్ములా ఈ-కారు రేసు కేసు విచారణలో కీలక మలుపు-మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం
Formula E car Race Case : ఫార్ములా ఈ-కారు రేసు కేసు కీలక మలుపు తిరిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో విచారణకు వచ్చేందుకు ఎఫ్‌ఈవో సంస్థ నాలుగు వారాల గడువు కోరింది.

Telangana News: తెలంగామలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన అవినీతి నిరోధక శాఖ ఎఫ్‌ఈవో సంస్థకు నోటీసులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ బదిలీ చేసిన యాభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన లోతైన విచారణ చేయాలని భావించింది. ఏసీబీ ఇచ్చిన నోటీసులపై స్పందించిన ఎఫ్‌ఈవో సంస్థ సీఈవోని పిలిచి ప్రశ్నించాలని నోటీసులు జారీ చేసింది.
నాలుగు వారాల గడువు కోరిన ఎఫ్‌ఈవో సంస్థ
ఏసీబీ పంపించిన నోటీసులపై అంతే ఫాస్ట్‌గా స్పందించింది ఎఫ్‌ఈవో సంస్థ. ఈ నోటీససులపై తిరిగి లెటర్ రాసిన ఆ సంస్థ సీఈవో విచారణకు రావడానికి సమయం కావాలని కోరారు. ఏసీబీ నోటీసులకు సమాధానం ఇస్తూ తమకు నాలుగు వారాల టైం కావాలని అందులో అభ్యర్థించారు. అయితే దీనిపై ఏసీబీ ఇంత వరకు స్పందించలేదు. ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి అయితే నెలకొంది.
తాజాగా చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను ప్రశ్నించిన ఏసీబీ
ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ఆయన్ని ఈనెల 9న పిలిచి సుదీర్ఘంగా విచారించింది. ఇదే కేసులో ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3 హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా పిలిచింది. ఈ రేస్‌లో స్పాన్సర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్‌జెన్, దీని అనుబంధ సంస్థ గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను ప్రశ్నించింది.
అనిల్ సమాచారం కీలకం
అనిల్‌కుమార్ విచారణ ఈ కేసులో కీలక మలుపుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసలు రేసు ఏర్పాటుకు ముందు ఏం జరిగింది. రేసు జరుగుతున్నటైంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. సడెన్‌గా ఈ కాంట్రాక్ట్ నుంచి ఆ సంస్థ ఎందుకు తప్పుకుందీ వంటి అనేక అంశాలపై పిన్ టు పిన్ అధికారులు ప్రశ్నించినట్టు చెప్పుకుంటున్నారు.
మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం
తాజాగా ఈ కేసులో అనిల్ కుమార్ ఇచ్చిన సమాచారంతో తదుపరి చర్యలకు ఏసీబీ అధికారులు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నిందితులను ఒక్కోసారి విచారించి. దాని నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మరో విడత అందర్నీ విచారించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కేటీఆర్ సహా అందర్నీ విచారణకు పిలవబోతున్నారు. వచ్చే వారం ఈ వారందరికి నోటీసులు పంపించబోతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-కారు రేసు కేసు పెను సంచలనంగా నమోదు అయింది. ఇది బీఆర్‌ఎస్‌లోనే కీలకంగా ఉన్న కేటీఆర్ చుట్టూ తిరగడంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇందులో అవినీతే జరగలేదని కేటీఆర్ అండ్ బ్యాచ్ వాదిస్తుంటే... అలాంటప్పుడు కేసు కొట్టేయాలని కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ కేసు నేపథ్యంలో చాలా ఇరు పార్టీ మధ్య పెద్ద ఫైట్ నడుస్తోంది.
Also Read: పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు.. ఆనందంలో కాలనీవాసులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

