Parliament Winter Session: పార్లమెంటు ఉభయ సభల్లో మళ్లీ రచ్చ, మోదీ సర్కార్ వెనకడుగు వేస్తోందన్న కాంగ్రెస్
పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీ, మణిపూర్ అల్లర్లు సహా ఇతర అంశాలపై ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో వాయిదా పడుతున్నాయి. సోమవారం కూడా ఇదే రగడ చోటుచేసుకోవడంతోవాయిదా పడ్డాయి.
Parliament Winter Session: దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటికిపరిష్కారాలు చూపించాల్సిన పార్లమెంటు(Parliament ) విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వంతో ముగిసిపోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో(Winter Session)నూ.. ఇదే వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ(Goutham Adani) వ్యవహారంపై అమెరికాలో నమోదైన కేసులపై ఇక్కడ విచారణ జరపాలని కోరుతూ.. విపక్ష సభ్యులు లోక్‌సభ, రాజ్యసభల్లో డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో చోటు చేసుకున్న అల్లర్ల వ్యవహారంపైనా చర్చకు పట్టుబడుతున్నాయి. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హరిహర మందిరం సర్వే పేరుతో చోటు చేసుకున్న ఘర్షణలు, కాల్పుల ఘటనపైనా చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. సరైన ఫార్మాట్‌లో రావాలని.. దేనికైనా చర్చకు సిద్ధమేనని ప్రభుత్వ పక్షం చెబుతున్నా.. ముందుగా.. వీటిపైనే చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలు వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి.
సోమవారం(డిసెంబరు 2) ఉభయసభల్లోనూ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండానే.. వాయిదాలు పడ్డాయి. ప్రతిపక్ష సభ్యులు తాము ఇచ్చిన నోటీసులు, వాయిదా తీర్మానం(Adjurnment motion)పై చర్చకు పట్టుబట్టారు. దీంతో లోక్‌సభ(Lok sabha)లో ప్రశ్నోత్తరాలు, రాజ్యసభ(Rajyasabha)లో జీరో అవర్ వంటివి ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ముగిసిపోయాయి.
ఇదిలావుంటే.. ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్లు.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో భేటీ అయ్యాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ ఎంపీరాహుల్‌గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా(Speaker Om birla)ను కలిసి.. సభ సజావుగా సాగేలా ఆయనను అభ్యర్థించాలని నిర్ణయించారు.
మరోవైపు రాజ్యసభలో పలువురు విపక్ష సభ్యులు.. వాయిదా తీర్మాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మానిక్కం ఠాకూర్.. ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు అందించారు. అమెరికా న్యాయ విభాగం గౌతం అదానీపై నమోదు చేసిన కేసులు..లంచాలు, అవినీతికి సంబంధించిన వ్యవహారాలపై చర్చకు పట్టుబట్టారు. ఇది ప్రజా ప్రయోజన కోణంలో ఉందని.. దీనిపై చర్చించాలని ఆయన కోరారు. ఆమ్ ఆద్మీపార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా రూల్ 267 కింద జీరో అవర్‌ను సస్పెండ్ చేసి.. చర్చకు అవకాశం కల్పించాలని విన్నవించారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలపై చర్చకు ఆయన పట్టుబట్టారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా.. మరో వాయిదా తీర్మానం ఇచ్చారు. బంగ్లాదేశ్ లో అరెస్టయిన ఇస్కాన్(ISCON) సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ వ్యవహారంపై చర్చించాలని ఆయన కోరారు. డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ కూడా.. మరో వాయిదా తీర్మానం ఇచ్చారు. మణిపూర్‌లో అల్లర్లపై చర్చించాలని పట్టుబట్టారు. అయితే.. ఆయా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను వాయిదా వేశారు.
కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడడం పట్ల కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక అంశాలపై చర్చకు ముందుకు రాకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించింది. అమెరికా కోర్టులో దాఖలైన గౌతం అదానీ కేసు, యూపీలో సంభాల్‌లో విధ్వంసం.. నలుగురు మృతి సహా ఇతర అంశాలపై చర్చకు ప్రభుత్వంవెనుకడుగు వేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. `` ఈ రోజు రెండు సభలూ వాయిదా పడ్డాయి. ఇండియా కూటమి పార్టీల సభ్యులు అదానీ, మణిపూర్, సంభాల్, అజ్మిర్ వంటి అంశాలపై అత్యవసర చర్చకు నోటీసులు ఇచ్చారు. ఈ పార్టీలు ఏమీ ఆందోళన చేయలేదు. భారీ నినాదాలు కూడా చేయలేదు. కానీ, పార్లమెంటు కార్యకలాపాలను మోదీ ప్రభుత్వం చాలా తేలికగా తీసుకుంటోంది. ఈ పరిస్థితి అత్యంత దారుణం. ప్రతిపక్షం ఆయా అంశాలపై చర్చ కోరుతుంటే.. ప్రభుత్వ పక్షం పారిపోతోంది`` అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్(JaiRam Ramesh) వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు.. రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ కోరుకుంటున్నాయని.. రాజ్యాంగానికి 75 వసంతాలు నిండిన సందర్భంగా.. తాము చర్చించాలని భావిస్తున్నామని తెలిపారు. కానీ, మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై చర్చకు ముందుకు రావడం లేదని రమేష్ వ్యాఖ్యానించారు.