Errabelli Dayakar Rao: 24 గంటల్లోగా నీళ్లు వదలకపోతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు
Warangal district | పంటలు ఎండిపోతున్నా నీళ్లు వదలడం లేదని, 24 గంటల్లోగా దేవన్నపేట పంప్ హౌస్ నుంచి నీళ్లు వదలకపోతే వరంగల్ వ్యాప్తంగా ధర్నాకు దిగుతామని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.

Errabelli Dayakar Rao | వరంగల్: దేవన్నపేట పంపు హౌస్ నుంచి 24 గంటల్లోగా నీళ్లు వదలకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఏకమై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల పంటలకు సాగు నీరు ఇచ్చేలా మాజీ సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల మూడో ఫేజ్ కింద 1494 కోట్లతో పనులు పూర్తి చేసినట్లు ఎర్రబెల్లి తెలిపారు.
మంత్రుల పర్యటన కోసం ఆపుతున్నారు..
దేవన్నపేట పంప్ హౌస్ వద్ద ఉన్న భారీ సామర్ధ్యం గల మోటార్లు పరిశీలించాం. అక్కడ ఉన్న లిఫ్ట్ అడ్వయిజర్ పెంటా రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లును కలిసి ఇప్పటికే వేల ఎకరాలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపాం. మిగిలిన పంటల కోసమైనా నీళ్లు ఇవ్వాలని కోరగా అధికారులు రేపటికల్ల పంపులు స్టార్ట్ చేసి నీళ్లు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రుల పర్యటన కోసం పంపు హౌస్ ఆన్ చేయకుండా ఆపుతున్నారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.
ఈ మోటార్లు ఆన్ చేయడానికి సాంకేతికంగా నిపుణులు ఆస్ట్రియ నుండి వచ్చిన ఆండ్రిడ్జ్ కంపెనీ ఇంజనీర్స్ తో మాట్లాడిన సమయంలో వారు కూడా ఈరోజు పనులు అయిపోతాయి. మీకు నీళ్లు వదులుతాం అన్నారు. కానీ దేవన్నపేట పంపు హౌస్ ట్రయిల్ రన్ పూర్తయినా కూడా నీళ్లు వదలకపోవటం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 24 గంటల్లోగా నీళ్లు వదలాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉమ్మడి వరంగల్ రైతులు అంతా ఏకమై జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

