మోదీ సర్కార్ జమిలిపై ఏ నమ్మకంతో ముందుకెళ్తోంది? లా కమిషన్ ఏం చెప్పింది?
One Nation One Election: జమిలి ఎన్నికలపై 2018లోనే లా కమిషన్ ఓ రిపోర్ట్ విడుదల చేసింది.
![మోదీ సర్కార్ జమిలిపై ఏ నమ్మకంతో ముందుకెళ్తోంది? లా కమిషన్ ఏం చెప్పింది? One Nation One Election What did the Law Commission suggest on One Nation-One Election in the 2018 report మోదీ సర్కార్ జమిలిపై ఏ నమ్మకంతో ముందుకెళ్తోంది? లా కమిషన్ ఏం చెప్పింది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/cbff50b5948c568f508b52f323d800c01693550634678517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
One Nation One Election:
జమిలి ఎన్నికలపై స్పెషల్ ప్యానెల్..
జమిలి ఎన్నికలపై మోదీ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. ఎప్పటి నుంచో దీనిపై చర్చలు జరుగుతున్నా...ఈ సారి మాత్రం ముందడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని కూడా ఏర్పాటు చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్‌ని ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మరోసారి దేశవ్యాప్తంగా One Nation One Electionపై చర్చ జరుగుతోంది. మరి జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా...? ఇప్పటికిప్పుడు మోదీ సర్కార్ ఎందుకీ నిర్ణయం తీసుకుంది..? సాహసం చేస్తోందా..? ఇలా ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. నిజానికి ఇన్నాళ్లుగా దీన్ని అమలు చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఎన్నో సవాళ్లు ఎదురవడం. లీగల్‌గా చూసుకుంటే చాలా సమస్యలు దాటుకుని రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీ ప్రజాభిప్రాయాలు సేకరించి ఆ మేరకు ఓ నివేదిక తయారు చేసి కేంద్రానికి సమర్పిస్తుంది. ఈ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులుంటారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లోతైన అధ్యయనం చేయనున్నారు. రాజ్యాంగ నిపుణులతోనూ చర్చించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల అభిప్రాయాలనూ సేకరించాలి. వీటిలో ఒక్కో పార్టీ ఒక్కో విధంగా స్పందించే అవకాశముంది. అలాంటప్పుడు అందరినీ ఒకేతాటిపైకి తీసుకురావడం చాలా కష్టం. ఈ సవాలు దాటడమే బీజేపీకి టఫ్ టాస్క్. అయితే...ఈ జమిలి ఎన్నికలపై గతంలోనూ చర్చ జరిగింది. 2018లోనే లా కమిషన్ (Law Commission) చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది. సాధ్యాసాధ్యాలపై కీలక వివరాలు వెల్లడించింది.
లా కమిషన్ ఏం చెప్పింది..?
ఒకే దేశం, ఒకే ఎన్నికపై 2018లోనే లా కమిషన్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో చాలా సానుకూలంగా స్పందించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడింది. పరిపాలనా పరంగానే కాకుండా సామాజిక, ఆర్థిక అభివృద్ధికీ ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది. ఖర్చులు తగ్గిపోవడంతో పాటు పదేపదే దేశంలో ఎన్నికల వాతావరణం లేకుండా చూడొచ్చని వివరించింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పరిపాలనా యంత్రాంగంపైనే కాకుండా భద్రతా బలగాలపైనా ఒత్తిడి తగ్గుతుందని, ప్రజాధనం కూడా వృథా కాకుండా అడ్డుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వాల పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకూ వీలవుతుందని స్పష్టం చేసింది. కేంద్ర న్యాయ శాఖ మరో విషయమూ ప్రస్తావించింది. ఉప ఎన్నికలనూ సమాంతరంగా నిర్వహించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది. Representation of the People Act, 1951లో సవరణలకూ అంగీకారం తెలిపింది. రాజ్యాంగ సవరణ తప్పదని వెల్లడించింది. ఇదంతా లీగల్‌గా చాలా చిక్కులతో కూడుకున్న పని. అందుకే 2018లోనే రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అప్పుడు అమలు చేయడం సాధ్యం కాలేదు. కానీ ఈ సారి పట్టువిడవకుండా కచ్చితంగా అమలు చేయాలని బీజేపీ టార్గెట్‌ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిల్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏ స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయో చూడాల్సి ఉంది.
Also Read: జమిలి ఎన్నికలపై మోదీ సర్కార్ గురి, కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక ప్యానెల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)