Andhra Pradesh Aqua Industry Issue: ఆంధ్రప్రదేశ్ రొయ్యకు ట్రంప్ వైరస్- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
Andhra Pradesh Aqua Industry Issue: బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తున్న ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యకు వైరస్ సోకింది. దీంతో ఏపీ ప్రభుత్వం విరుగుడు చర్యలకు సిద్ధమైంది.

Andhra Pradesh Aqua Industry Issue: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగాన్ని ఆదుకునే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తుందని... సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యకు పరిష్కారం చూపేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు చేద్దామని సిఎం ప్రతిపాదించారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం, భవిష్యత్‌కు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ సూచనలు చేయాలని సిఎం అన్నారు. ఈ కమిటీలో ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు ఉంటారు. ఈ కమిటీ ఏర్పాటు చేసి మరింత లోతుగా సమస్యపై అధ్యయనం చేయనున్నారు. ఆ కమిటీ చర్చించి చర్చించి పరిష్కారం చూపేందుకు అవసరమైన సూచనలు ఈ కమిటీ చేయనుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ సూచనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. అమెరికా ప్రభుత్వ కొత్త సుంకాల కారణంగా ఏపీలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆక్వా రైతులు, ఆక్వా రంగ భాగస్వాములు, ఎగుమతిదారులు, ప్రభుత్వ అధికారులతో చంద్రబాబు చర్చించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి అభిప్రాయలను తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించడానికి ఉన్న అవకాశాలపై వారితో మాట్లాడారు.
ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులు ఉన్నారని... అలాగే, ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారని సీఎంను కలిసిన ప్రతినిధులు వివరించారు. ఇప్పటికే అనేక సమస్యలతో కుదేలవుతున్న ఆక్వా రంగానికి కొత్త సుంకాలు మరింత నష్టం చేస్తాయని రైతులు, ఎగుమతిదారులు తెలిపారు. ఈక్విడార్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అమెరికాతో కేంద్రప్రభుత్వం సత్వర సంప్రదింపులు జరిపేలా కేంద్రంతో మాట్లాడనున్నారు.
అనూహ్య సమస్య ఇది... అండగా ఉంటాం: ఏపీ ప్రభుత్వ హామీ
ఆక్వా రంగానికి ఇప్పుడు వచ్చింది ఊహించని, అనూహ్య సమస్య అని, దీనికి భయపడిపోకుండా... అంతా కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. సమన్వయంతో ఉంటేనే ఆక్వా రంగం ముందుకు సాగుతుందని సిఎం అన్నారు. రైతులకు నమ్మకాన్ని కల్గించాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. ఆక్వాకు ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల వైరస్‌లు, వ్యాధులు తగ్గి...పంట నాణ్యత మెరుగుపడుతుందని రైతులు చెప్పగా.... దీనికి సిఎం అంగీకారం తెలిపారు. గిట్టుబాటు ధర తగ్గకుండా చూడాలని కోరగా....100 కౌంట్ రొయ్యలకు రూ.220 ధరకు కొనుగోలు చేయాలని వ్యాపారులకు నిర్దేశించారు. దీనికి వ్యాపారులు కూడా సహకరించాలని అన్నారు. సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయని ఎగుమతి దారులు చెప్పగా... ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడతామని సిఎం అన్నారు. ఇప్పటికే లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తెచ్చామని... కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. ఆక్వాలో భాగస్వాములుగా ఉన్న అన్ని వర్గాలు కలిసి సమిష్టిగా అడుగువేస్తేనే... ఈ రంగం నిలబడుతుందని సిఎం అన్నారు.




















