Lakhimpur Kheri Violence Case: లఖింపుర్ ఖేరీ కేసులో కీలక సాక్షిపై కాల్పులు
Lakhimpur Kheri Violence Case: బీకేయూ నేత దిల్బగ్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి కాల్పులు జరిపారు.
Lakhimpur Kheri Violence Case: లఖింపుర్ ఖేరీ కేసులో కీలక సాక్షి, భారత కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత దిల్బగ్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కాల్పులు జరిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.
బైక్‌పై వచ్చి
బీకేయూ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దిల్బగ్ సింగ్.. మంగళవారం రాత్రి తన ఇంటికి కారులో ప్రయాణమయ్యారు. అయితే గోలా కోట్‌వాలీ ప్రాంతంలో ఉన్న అలిగంజ్- ముడా రోడ్డులో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన వాహనంపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారు.
దర్యాప్తు
ఘటనపై దిల్బగ్ సింగ్.. గోలా కోట్‌వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన గురించి బీకేయూ ప్రతినిధి రాకేశ్ టికాయత్‌కు కూడా వివరించినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులను ఘటనా స్థలికి పంపించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
లఖింపుర్ ఖేరీ ఘటన
గత ఏడాది అక్టోబర్ 3న కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులపైకి కేంద్రమంత్రి కుమారుడు అజయ్ మిశ్రా వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు మృతి చెందారు. ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మరో ముగ్గురు మరణించారు.
Also Read: Coronavirus Update India: దేశంలో కొత్తగా 2,745 కరోనా కేసులు- ఆరుగురు మృతి