Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Borewell: రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోగా గత 3 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ర్యాట్ హోల్ మైనర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Child Stuck In Borewell In Rajasthan: రాజస్థాన్‌లో (Rajasthan) తీవ్ర విషాద ఘటన జరిగింది. ఓ చిన్నారి బోరుబావిలో (Borewell) పడిపోయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోఠ్‌పుత్లీ (Kotputhli) జిల్లాలో చేతన అనే చిన్నారి తన తండ్రి పొలంలో ఆడుకుంటూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 150 అడుగుల లోతు వద్ద చిన్నారి చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత కుటుంబ సభ్యులు చిన్నారిని రక్షించేందుకు యత్నించగా.. మరింత కిందకు జారుకుంది. ఈ క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించారు. పైపుతో బోరులోకి ఆక్సిజన్ పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం క్లిప్స్ సాయంతో 30 అడుగులు పైకి లాగినట్లు చెప్పారు.
'ఇప్పటికే 160 అడుగుల గొయ్యి తవ్వాం. ఇక చిన్నారి ఉన్న బోరుబావికి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. అది ఫైలింగ్ మిషన్‌తో కుదరదు. కాబట్టి మనుషులే తవ్వాల్సి ఉంటుంది. గురువారం ఆ చిన్నారిని బయటకు తీస్తాం.' అని ఎన్‌డీఆర్ఎఫ్ అధికారి యోగేశ్ కుమార్ మీనా తెలిపారు. ప్రస్తుతం ర్యాట్ హోల్ మైనర్స్ సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, గత 68 గంటలుగా చిన్నారి బోరుబావిలోనే ఉండడంతో సరత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అసలేంటీ ర్యాట్ హోల్ మైనర్స్..?
సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్ హోల్ మైనింగ్‌గా వ్యవహరిస్తారు. నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్‌గా పేర్కొంటారు. సుమారు 4 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటూ ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. ఈ క్రమంలో నిర్దేశిత ప్రదేశానికి చేరుకుని సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పార, తదితర ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే తవ్వుతారు. తాళ్లు, అవసరమైతే నిచ్చెనల సాయంతో వెళ్లి కొద్దికొద్దిగా తవ్వుకుంటూ శిథిలాలను కొంతదూరంలో డంప్ చేస్తారు. అక్కడి నుంచి ట్రాలీ ద్వారా బయటకు తరలిస్తారు. ఈ విధానం ద్వారా భూమి లోపల నిర్ధేశిత ప్రదేశానికి చేరుకుంటారు. అయితే, మైనింగ్‌కు సంబంధించి ఈ విధానాన్ని నిషేధించారు. ఈ విధానంలో గనుల్లోకి వెళ్లే కార్మికులకు భద్రత, పర్యావరణానికి సైతం హాని కలుగుతుందని 2014లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ దీన్ని నిషేధించింది. కాగా, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ విధానంలోనే కాపాడారు.