Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Telugu News: 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు కూడా ఇకపై ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Union Cabinet Decisions: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అమలు అవుతున్న ఆయుష్మాన్ భారత్ విషయంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో 70 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించనుంది. వారు కూడా ఇకపై ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం కారణంగా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు, 4.5 కోట్ల కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరుతుందని కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద ఉన్న కుటుంబాలు వారి కుటుంబాల పెద్దలకు రూ.5 లక్షల అదనపు కవరేజీని పొందుతారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో లబ్ధిదారుల సామాజిక-ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ ఆయుష్మాన్ భారత్ (AB PM-JAY) ప్రయోజనాలను పొందేందుకు అర్హులని ఆయన తెలిపారు. అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద ఇకపై కొత్తగా ప్రత్యేకంగా ఓ కార్డు జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అయిన కుటుంబాల నుంచి 70 ఏళ్లు, లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు ఏడాదికి రూ.5 లక్షలదాకా అడిషనల్ టాప్-అప్ కవర్ పొందుతారు.
మరో 5 కీలక నిర్ణయాలు
ఆయుష్మాన్ భారత్ ను 70 ఏళ్ల పైబడిన వారికి కూడా వర్తింపజేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మరో 5 కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో సవరణలు చేశారు. 31,350 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కూడా రూ.12,461 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచేందుకు రూ.10,900 కోట్లతో ‘పీఎం ఈ-డ్రైవ్’ అనే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని సాయంతో దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

