Love Mouli Movie Review - లవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ - సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?
Love Mouli Review In Telugu: 'లవ్ మౌళి'లో నవదీప్ 2.ఓ కనిపిస్తారని చాలా బలంగా ప్రచారం చేశారు. ప్రచార చిత్రాల్లో బోల్డ్ సీన్లు, లిప్ కిస్సులు కొందర్ని ఆకర్షించాయి. మరి, సినిమా ఎలా ఉంది?
అవనీంద్ర
నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, 'మిర్చి' హేమంత్, 'మిర్చి' కిరణ్ తదితరులు
Navdeep's Love Mouli Review Telugu: కథానాయకుడిగా నవదీప్ విజయవంతమైన సినిమాలు చేశారు. అయితే... సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా ఆయనకు కొంత విరామం వచ్చింది. అగ్ర హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. నటుడిగా, కథానాయకుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ నవదీప్ చేసిన సినిమా 'లవ్ మౌళి'. విడుదలకు ముందు నుంచి ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. బోల్డ్ సీన్లు, లిప్ లాక్స్ వల్ల కావాల్సినంత ప్రచారం లభించింది. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Love Mouli Story): మౌళి (నవదీప్) ఒక పెయింటర్. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోతారు. కొడుకును తమకు వద్దని అనుకోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. సమాజానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా పెరిగిన మౌళి తనకు నచ్చినట్టు జీవిస్తాడు. ఎటువంటి బంధాలు కోరుకోడు. చుట్టుపక్కల వారందరూ తనను అర్థం చేసుకుని తనలా బ్రతకాలని కోరుకుంటాడు. మౌళికి ఒక రోజు అఘోర (రానా) తారసపడతాడు. తనకు నచ్చిన లక్షణాలు ఉన్న అమ్మాయిని సృష్టించుకునే అవకాశం వస్తుంది మౌళికి.
స్వతహాగా పెయింటర్ కావడంతో చిత్ర (పంఖురి గిద్వానీ) బొమ్మ గీస్తాడు. ఆమె జీవం పోసుకుని మౌళి ముందుకు వస్తుంది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటి అవుతారు. కొన్ని రోజులకు చిత్రను వద్దనుకుని మరొక బొమ్మను మౌళి ఎందుకు గీశాడు? ఆ సమయంలో అతని ముందుకు ఎవరు వచ్చారు? తనకు నచ్చిన లక్షణాలు ఉన్న అమ్మాయిని సృష్టించుకునే అవకాశం మౌళికి వస్తే... దాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణ (Love Mouli Review Telugu): ప్రేమ... ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఒక్కొక్కరూ ఆ ప్రేమను ఒక్కో విధంగా చూపిస్తారు. రొమాన్స్ కూడా ప్రేమలో ఒక భాగమే. అయితే... అందులో కొందరికి కామం కనిపించవచ్చు. ఈతరం యువతకు కామన్‌గా కనిపిస్తుంది. అందర్నీ మెప్పించే ఉద్దేశంతో కొందరు దర్శకులు తాము చెప్పాలని అనుకున్న విషయాన్ని బలంగా చెప్పడానికి సందేహిస్తారు. సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు తమ విజన్ వెండితెరపై ఆవిష్కరిస్తారు. 'లవ్ మౌళి' తీసిన అవనీంద్ర ఆ కోవలోకి వచ్చే దర్శకుడు.
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సక్సెస్ కావడానికి కారణం బోల్డ్ కంటెంట్ ఒక్కటే కాదు... ఆయా సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్లు, కథలు కూడా! 'లవ్ మౌళి'లోనూ ఆ తరహా బోల్డ్ క్యారెక్టర్ కుదిరింది. అవనీంద్ర తాను చెప్పాలనుకున్న పాయింట్ అంతే బోల్డుగా చెప్పారు. అయితే... సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్ బాధ్యతలు సైతం ఆయన చూసుకున్నారు. అటువంటి సందర్భాల్లో దర్శకులకు తాను తీసిన విజువల్స్ & కంటెంట్ మీద ప్రేమతో కత్తెరకు ఎక్కువ పని చెప్పడానికి సందేహిస్తారు. 'లవ్ మౌళి' విషయంలోనూ అది జరిగింది.
అవనీంద్ర ఐడియాలజీ బావుంది. ప్రేమ లేదంటే జీవిత భాగస్వామి నుంచి మనిషి కోరుకునేది, ముఖ్యంగా మగాడు కోరుకునేది ఏమిటి? అనే పాయింట్ తీసుకుని న్యూ ఏజ్ మూవీ మేకింగ్, మోడ్రన్‌గా చెప్పిన తీరు బావుంది. మగాడికి ఆశ, ఈగో ఎక్కువ అనేది చక్కగా చెప్పారు. రియాలిటీని చూపించారు. అయితే... హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చెయ్యడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. అందులోనూ ఇంటర్వెల్ వరకు ఎక్కువ లవ్ మేకింగ్ సీన్లు రావడంతో కథ ఎంత సేపటికీ ముందుకు కదలని ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ క్లిక్ కాలేదు.
Also Read: సత్యభామ రివ్యూ: యాక్షన్‌తో చితక్కొట్టిన కాజల్ - బరిలో మిగతా సినిమాలకు పోటీ ఇస్తుందా?
దర్శకుడిగా కంటే రచయితగా, ఛాయాగ్రాహకుడిగా అవనీంద్ర ఎక్కువ మెప్పించారు. మేఘాలయ లొకేషన్లను తెరపై అందంగా చూపించారు. గోవింద్ వసంత్ నుంచి మంచి సంగీతం తీసుకున్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
'లవ్ మౌళి' సినిమా హీరోగా నవదీప్ కమ్ బ్యాక్ సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నుంచి యాక్టింగ్ వరకు ప్రతి విషయంలో కొత్తగా కనిపించారు. నటుడిగా ఆయన ఇప్పుడు కొత్తగా తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఆయన ప్రతిభను మరోసారి గుర్తు చేసే చిత్రమిది. ఈ సినిమా తర్వాత తప్పకుండా ఆయనకు హీరోగా మరిన్ని అవకాశాలు వస్తాయి. అంతలా మౌళి పాటలో జీవించారు. నవదీప్ కంటే హీరోయిన్ పంఖురి గిద్వానీకి నటనలో ఎక్కువ వేరియేషన్స్ చూపించే అవకాశం వచ్చింది. మూడు డిఫరెంట్ లుక్స్, గెటప్పుల్లో ఆవిడ కనిపించింది. గ్లామర్, పెర్ఫార్మన్స్... రెండూ చూపించారు. రానా అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. మిగతా నటీనటులు ఓకే.
మగాడి మనస్తత్వాన్ని ఆవిష్కరించే సినిమా 'లవ్ మౌళి'. బోల్డ్ సీన్లు, లిప్ కిస్సులు మాత్రమే కాదు... ప్రేమ గురించి ఆలోచింపజేసే విషయాలు ఉన్నాయి. అయితే... లవ్ మేకింగ్ ఎక్కువ కావడం, కామెడీ క్లిక్ కాకపోవడంతో ఫస్టాఫ్ ఎక్కువసేపు సాగదీసినట్లు ఉంటుంది. ఇటువంటి రొమాంటిక్ డ్రామా తీయడం సాహసోపేతమైన నిర్ణయం. యువతను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. నవదీప్, పంఖురి గిద్వానీ నటన కూడా! అయితే... ఇది ఫ్యామిలీతో చూసే సినిమా కాదు. జీవిత భాగస్వామితో చూసే సినిమా.
Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా