Satyabhama Movie Review - సత్యభామ రివ్యూ: యాక్షన్‌తో చితక్కొట్టిన కాజల్ - బరిలో మిగతా సినిమాలకు పోటీ ఇస్తుందా?
Satyabhama Review In Telugu: క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫిమేల్ యాక్షన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ 'సత్యభామ'. మే 7న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సుమన్ చిక్కాల
కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నేహా పఠాన్, ప్రజ్వల్, అనిరుధ్ పవిత్రన్, హర్షవర్ధన్ తదితరులు
Satyabhama Movie 2024 Review In Telugu: కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ను తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు చందమామ అంటుంది. అయితే... ఆవిడలో మాస్ చాలా ఉందని, ఆ యాంగిల్ సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరిస్తూ 'సత్యభామ' తీశామని చిత్ర బృందం చెప్పింది. 'మేజర్' దర్శకుడు శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది రివ్యూలో చూడండి.
కథ (Satyabhama Movie Story): సత్యభామ (కాజల్ అగర్వాల్) సిన్సియర్ పోలీస్. షీ టీమ్ హెడ్! ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందని తెలిస్తే అస్సలు ఊరుకోదు. అటువంటి సత్యభామ కళ్ల ముందు హసీనా (నేహా పఠాన్) హత్యకు గురి అవుతుంది. ఆ గిల్ట్ ఆమెను వెంటాడుతుంది. ఎందుకంటే... ప్రేమించి పెళ్లి చేసుకున్న యదు (అనిరుధ్ పవిత్రన్) తనకు వేధిస్తున్న సంగతి చెబితే ఏం కాకుండా చూస్తానని భరోసా ఇస్తుంది.
రెండేళ్లు గడిచినా... హసీనాను చంపిన యదు దొరకడు. అలాగని సత్యభామ తన అన్వేషణ ఆపదు. ఒకరోజు హసీనా తమ్ముడు ఇక్బాల్ (ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఆ కేసులో ఎంపీ సోదరుని కుమారుడు రిషి (అంకిత్ కొయ్య) హస్తం ఉందని తెలిసి... ఉన్నతాధికారులు మాటలు సైతం లెక్క చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ క్రమంలో సత్యభామ తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఇక్బాల్ కిడ్నాప్ వెనుక ఎవరు ఉన్నారు? ఈ కేసుకు, మహిళలతో పాటు చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధం ఏమిటి? మెడికల్ స్టూడెంట్ ఇక్బాల్ తీవ్రవాది అనే మాటల్లో నిజం ఎంత? యదు ఎక్కడ ఉన్నాడు? అతడిని సత్యభామ పట్టుకోగలిగిందా? లేదా? తన కళ్ల ముందు హసీనాను పోగొట్టుకున్న సత్యభామ... ఆ విధంగా మరొకరిని పోగొట్టుకోకుండా ఏం చేసింది? అనేది సినిమా.
విశ్లేషణ (Satyabhama Movie Review): ఆయుధంతో యుద్ధం చేయడం కంటే కొన్ని సార్లు ఆలోచనతో ఎదుటి వ్యక్తి చేసే యుద్ధాన్ని అడ్డుకోవచ్చని, విజయం సాధించవచ్చని చెప్పే సినిమా 'సత్యభామ'. సినిమాగా చూస్తే ఇదొక థ్రిల్లర్. కానీ, ఈ కథలో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఉంది. మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఉంది. సాటి మహిళలకు అండగా లేడీ పోలీస్ ఆఫీసర్ చేసిన పోరాటం ఉంది. ఈ 'సత్యభామ'ను ఒక్క జానర్ మూవీగా పేర్కొనలేం. కానీ, ఎప్పటికప్పుడు మూవీని కొత్త మలుపులోకి తిప్పుతూ థ్రిల్ మిస్ కాకుండా స్క్రీన్ ప్లే రాసిన శశికిరణ్ తిక్కను మెచ్చుకోవాలి.
'సత్యభామ' ఎక్కడ మొదలైంది? ఎక్కడ ముగిసింది? అనేది చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో పాటలకు స్కోప్ తక్కువ. 'సత్యభామ' పాటతో మొదలవుతుంది. నవీన్ చంద్ర, కాజల్... ప్రేమ, పెళ్లి చూపించడంతో ఆ ఇద్దరి మధ్య బంధాన్ని సుమన్ చిక్కాల ఆవిష్కరించారు. ఇది అవసరమా? అని సందేహం కలిగినా... కథలో కీలక సందర్భంలో భావోద్వేగాలు వచ్చినప్పుడు వాళ్లిద్దరి బంధం ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది. హసీనా తమ్ముడు మెడికల్ స్టడీస్, కథలో కోర్ పాయింట్‌కి కనెక్ట్ చేసిన తీరు బావుంది. అయితే... కథను కాస్త క్రిస్పీగా చెప్పి ఉంటే మరింత బాగుండేది. ఒకానొక సమయంలో అసలు కథ వదిలేసి కొసరు కథలపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అది అవాయిడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.
శ్రీచరణ్ పాకాల సంగీతం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ప్రతి సన్నివేశంలో ది బెస్ట్ రీ రికార్డింగ్ ఇచ్చారు. విష్ణు సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ కూడా బావుంది. స్క్రీన్ మీద హాలీవుడ్ స్టైల్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
Also Read: మనమే రివ్యూ: ఓవర్సీస్‌లో నెగెటివ్ టాక్, మూవీ అంత బ్యాడా? శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?
'సత్యభామ'లో కొత్త కాజల్ అగర్వాల్ కనిపించింది. పెళ్లి తర్వాత మునుపటిలా కనిపిస్తుందా? అనే సందేహాలను పటాపంచలు చేస్తూ... నటనలో తన పవర్ చూపించింది. యాక్షన్ సన్నివేశాల్లో, ముఖ్యంగా విమెన్ ట్రాఫికింగ్ దగ్గర చేసిన ఫైటులో అదరగొట్టింది. ఇంతకు ముందు ఆవిడ చేసిన పోలీస్ రోల్స్, ఈ రోల్ మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. కాజల్ భర్తగా నవీన్ చంద్ర పాత్ర పరిధి పరిమితమే. ఓ రచయితగా, భార్యకు మద్దతు ఇచ్చే భర్తగా తన పాత్రకు న్యాయం చేశారు.
హసీనా పాత్రలో నటించిన నేహా పఠాన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కీలక పాత్రలో కళ్లతో నటించిన తీరు అమోఘం. ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంకిత్ కొయ్య కూడా బాగా చేశారు. ప్రజ్వల్, అనిరుధ్ పవిత్రన్, ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
కథానాయికగా ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్... తెలుగులో తొలిసారి నటించిన మహిళా ప్రాధాన్య చిత్రం 'సత్యభామ'. సమాజంలో, ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోనూ... స్నేహితుల విషయంలోనూ మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పే సినిమా 'సత్యభామ'. కొత్త కాజల్ అగర్వాల్ కనిపించే సినిమా 'సత్యభామ'. ఆమె నటనతో పాటు ట్విస్టులు, శ్రీచరణ్ పాకాల సంగీతం మెప్పిస్తాయి.
Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా