Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Pawan Kalyan About Allu Arjun Arrest | చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేశారని భావిస్తే రేవంత్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేస్తారని అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan made sensational comments on Allu Arjuns arrest | అమరావతి: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. అభిమాని రేవతి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే బాధితులను పరామర్శించాలి కానీ, గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు, వాళ్ల టీమ్ అయినా వెంటనే మృతిచెందిన వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శిస్తే సరిపోయేదన్నారు. మానవతా ధృక్పథం లోపించినట్లు కనిపిస్తుందననారు.
తెలంగాణ సీఎం రేవంత్ పాలన భేష్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి కాబట్టే హీరో అయిన అల్లు అర్జెన్‌ను అరెస్టు చేయగలిగారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అరెస్ట్ చేస్తారని కామెంట్ చేశారు. తన పేరు చెప్పలేదని అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్టు చేశారని అనడం పెద్ద తప్పు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అన్నారు. తెలుగు పరిశ్రమకు రేవంత్ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది. పుష్ప 2 బెనిఫిట్ షోలు ఇవ్వడం, టికెట్ రేట్లు పెంపు నిర్ణయం సినిమాలను ప్రోత్సహించడమే అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖలు వైరల్ అవుతున్నాయి.
అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ
అసలే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. తామంతా ఒకటేనని వారు పలు ఈవెంట్లలో స్టేజీ మీద చెప్పేశారు. అల్లు అర్జున్ సినిమాల ప్రిరిలీజ్ ఈవెంట్లలో పవర్ స్టార్ పవర్ స్టార్ అని, లేక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని మెగా ఫ్యాన్స్ అరవడం తెలిసిందే. కెరీర్ మొదట్లో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన అల్లు అర్జున్ గత కొన్ని సినిమాల నుంచి మెగా అనే ప్రభావం తగ్గిస్తూ వస్తున్నారు. పుష్ప సినిమాకు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ ను స్పందన అడిగితే గంజాయి స్మగ్లింగ్ చేసే సినిమాకు జాతీయ అవార్డులు రావడం ఏంటోనని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల ప్రచారంపై వివాదం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు తమ వీలు చూసుకుని ప్రచారంలో పాల్గొన్నారు. లేకపోతే నేరుగా పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలుసుకుని మద్దతు తెలిపారు. అందుకు భిన్నంగా పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం వివాదాన్ని రాజేసింది. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లిన సమయంలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా సమీకరణాలు మారిపోయాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు మద్దతు తెలపలేదు కానీ, నంద్యాలకు వెళ్లి మరీ వైసీపీ వారిని కలవడం రాజకీయంగానూ దుమారం రేపింది. తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుపై ముందుగానే నిర్ణయం తీసుకోగా, ఏపీలో మాత్రం కాస్త ఆలస్యమైంది. పుష్ప 2 ప్రి రీలీజ్ జరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం తెలిసిందే.
ఇటీవల జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన ఎవరికైనా అది నిజం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఈవెంట్ కేవలం అల్లు ఈవెంట్ అని, మెగా ఫ్యామిలీ, మెగా అనే పదానికి సంబంధమే లేదన్నట్లుగా జరిగిందని అంతా గమనించారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అని తెలియగానే చిరంజీవి విశ్వంభర షూటింగ్ రద్దుచేసుకుని వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. నాగబాబు సైతం వెళ్లారు. చివరగా జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ కుటుంబంతో వెళ్లి చిరంజీవిని కలవడం చూసిన వారు ఆఫ్యామిలీ అంతా ఒకటేనని చూపిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు టార్గెట్ చేసి చేసినవి కాకపోయినా, అదే అర్థం వస్తుందని నెటిజన్లు, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ డిసెంబర్ 27న దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్‌గా కోర్టు విచారణకు నటుడు హాజరయ్యారు. హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుచేసిందని, రెగ్యూలర్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి నాంపల్లి కోర్టును కోరారు. నేడు పోలీసులు దాఖలు చేసిన బెయిల్ కౌంటర్ పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా లేదా అనే చర్చ మొదలైంది.