Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Sandhya Theatre Incident | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం నాడు వాదనలు జరిగాయి. తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది న్యాయస్థానం.
Nampally court postpones Verdict of Pushpa 2 Actor Allu Arjuns bail petition | హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. నేడు అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, బెయిల్ పై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ ను పరిశీలించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జనవరి 3కు తీర్పు వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ విధించగా పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అదేరోజు హైకోర్టులో వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం తెలిసిందే. దాంతో రెగ్యూలర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ లాయర్లు ప్రయత్నిస్తున్నారు.
అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలు ఇలా..
అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ వాదనలు వినిపించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్ కు ఏం సంబంధం లేదు. రేవతి మృతికి నటుడు కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదు. బీఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదు. హైకోర్టు ఈ కేసులో ఇదివరకే అల్లు అర్జున్‌కు మధ్యంతర ఇచ్చింది. దాంతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని నిరంజన్ రెడ్డి నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు.
పబ్లిక్ ప్రాసుక్యూటర్ వాదనలు ఇవీ..
మహిళా అభిమానికి రేవతి మృతికి నటుడు అల్లు అర్జున్ ప్రధాన కారణం. థియేటర్ కు ఆయన ర్యాలీ, రోడ్ షోగా రావడంతోనే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. నటుడికి బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రెగ్యూలర్ బెయిల్ వస్తే అల్లు అర్జున్ పోలీసుల విచారణకు సహకరించడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. అందుకే అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ ని కొట్టివేయాలని న్యాయమూర్తిని కోరారు.
అసలేం జరిగిందంటే..
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12 వేల స్క్రీన్లలో రిలీజ్ అయింది. అయితే డిసెంబర్ 4న హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్నా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌కు వెళ్లి పెయిడ్ ప్రీమియర్ షో చూశారు. అయితే అల్లు అర్జున్ రాక సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళా అభిమాని చనిపోగా, ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై కేసు నమోదు చేసి 18 మందిని నిందితులుగా చేర్చారు. ఏ 11గా అల్లు అర్జున్ ఉండగా, ఏ18గా పుష్ప 2 నిర్మాత ఉన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా రెండు వారాల రిమాండ్ విధించింది కోర్టు. అదే రోజు హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.