Manamey Movie Review - మనమే రివ్యూ: ఓవర్సీస్‌లో నెగెటివ్ టాక్, మూవీ అంత బ్యాడా? శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?
Manamey Review In Telugu: శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'మనమే'. ఇది ఎలా ఉందో రివ్యూలో చూడండి.
శ్రీరామ్ ఆదిత్య
శర్వానంద్, విక్రమ్ ఆదిత్య, కృతి శెట్టి, ఆయేషా ఖాన్, 'వెన్నెల' కిశోర్, సుదర్శన్, శివ కందుకూరి, త్రిగుణ్, మౌనికా రెడ్డి, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రుషి, తులసి, సీత తదితరులు
Sharwanand's Manamey Movie Review: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా సినిమా 'మనమే'. ఆయన 35వ చిత్రమిది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. ఇందులో కృతి శెట్టి కథానాయిక. దర్శకుడి తనయుడు విక్రమ్ కీలక పాత్ర చేశారు. ఫారిన్ నేపథ్యంలో ఓ చిన్నారి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది రివ్యూలో చూడండి.
కథ (Manamey Story): విక్రమ్ (శర్వానంద్) ప్లే బాయ్ టైపు. లండన్‌లో తనకు నచ్చినట్టు హ్యాపీగా ఉంటాడు. విక్రమ్ స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్), శాంతి (మౌనికా రెడ్డి) దంపతులు ఇండియా వెళతారు. అక్కడో ప్రమాదంలో వాళ్లిద్దరూ మరణించగా... వాళ్ల కుమారుడు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ఒంటరి అవుతాడు. మౌనిక స్నేహితురాలు సుభద్ర (కృతి శెట్టి)తో కలిసి పిల్లాడి బాధ్యతలు విక్రమ్ తీసుకోవలసి వస్తుంది.
విక్రమ్, సుభద్ర, ఖుషి లండన్ వస్తారు. తామిద్దరికీ పెళ్లి కానప్పటికీ ఖుషి కోసం తల్లి దండ్రుల బాధ్యతలు తీసుకుంటారు విక్రమ్, సుభద్ర. పిల్లాడిని పెంచే విషయంలో వాళ్ల మధ్య ఎన్ని గొడవలు జరిగాయి. పెళ్లి కాకముందు వేరొక అబ్బాయితో కలిసి ఓ చిన్నారి బాధ్యతలు తీసుకుంటే... సుభద్రను పెళ్లి చేసుకోబోయే కార్తీక్ (శివ కందుకూరి) ఏమన్నాడు? ఖుషి కోసం విక్రమ్ తనలో తాను ఏం మార్చుకున్నాడు? చివరకు విక్రమ్, సుభద్ర కలిశారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Manamey Review in Telugu): ఎప్పటికప్పుడు డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే హీరో శర్వానంద్. 'ఒకే ఒక జీవితం' ఎమోషనల్ హిట్ తర్వాత ఆయన కూల్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మనమే' చేశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్లజెంట్ ఫీలింగ్ ఇచ్చాయి. మరి, సినిమా ఎలా ఉంది? అనే విషయానికి వస్తే...
'మనమే' థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది శర్వానంద్ లుక్స్, ఆయన ఎనర్జీ & కామెడీ టైమింగ్. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 'మనమే'లో శర్వా సూపర్ స్టైలిష్‌గా ఉన్నారు. 'రన్ రాజా రన్'ను మించి హుషారుతో కనిపించారు. టీజర్‌లో 'ఇద్దరిలో ఒకరు ఏడవండి' డైలాగ్ పాపులర్ అయ్యింది కదా! ఆ టైపు వన్ లైనర్స్, పంచ్ డైలాగులతో శర్వానంద్ నవ్వించారు. ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శర్వా ఎప్పుడూ బెస్ట్ ఇస్తారు. సన్నివేశం కుదిరినప్పుడు, కథలో సందర్భం వచ్చినప్పుడు అద్భుతంగా చేశారు. అయితే... ఆ ఎమోషన్స్ పరిధి తక్కువ.
శర్వా తర్వాత చిన్నారి విక్రమ్ ఆదిత్య గురించి చెప్పుకోవాలి. ఖుషి పాత్రలో చాలా సహజంగా కనిపించాడు. అతడి నటన ముద్దొస్తుంది. ఇక హీరోయిన్ కృతి శెట్టి విషయానికి వస్తే... అందంగా కనిపించారు. అద్భుతంగా నటించారు కూడా! అయితే... శర్వా, కృతి మధ్య కాస్త రొమాంటిక్ సీన్స్ ఆశించే ప్రేక్షకులకు డిజప్పాయింట్ తప్పదు. కథలో అటువంటి సన్నివేశాలకు సందర్భం కుదరలేదు. రాహుల్ రవీంద్రన్ కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. అయితే, ఆ పాత్రకు అంత స్కోప్ లేదు. శివ కందుకూరి పాత్ర నిడివి కూడా తక్కువే. తన వరకు బాగా చేశారు. ఆయేషా ఖాన్, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ మధ్యలో కొన్ని నవ్వులు పూయించారు. సచిన్ ఖేడేకర్, తలసి, ముఖేష్ రుషి, సీత తమ పాత్రల పరిధి మేరకు చేశారు. త్రిగుణ్ అతిథిలా తళుక్కున మెరిశారు.
కథ విషయానికి వస్తే... కొత్తది ఏమీ కాదు. 'పసివాడి ప్రాణం', 'భజరంగీ భాయిజాన్' సినిమాల స్ఫూర్తితో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య హీరో క్యారెక్టర్, కోర్ పాయింట్ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. కథ, కథనంతో కంటే మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ కామెడీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. హీరో క్యారెక్టరైజేషన్ కారణంగా చాలా రొటీన్ సన్నివేశాలు వినోదాత్మకంగా అనిపిస్తాయి. ట్విస్టుల నుంచి 'నెక్స్ట్ ఏంటి?' అనే సన్నివేశాల వరకు అంతా ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా ముందుకు వెళతాయి. ఫస్టాఫ్ నవ్వించిన శ్రీరామ్ ఆదిత్య, ఇంటర్వెల్ తర్వాత ఎమోషన్స్ & కామెడీ బ్యాలన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. దాంతో నిడివి ఎక్కువ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా
శ్రీరామ్ ఆదిత్య మెజారిటీ సన్నివేశాలను విజువల్ పరంగా చెప్పాలని చూశారు. ఆ ఆలోచన మంచిదే. కానీ, సన్నివేశం ప్రేక్షకుడి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది కూడా చూసుకోవాల్సింది. బ్యూటిఫుల్ విజువల్స్, మెలోడియస్ మ్యూజిక్ ఉన్నా కొన్నిసార్లు ల్యాగ్ అనిపించడానికి, ప్రేక్షకులకు సన్నివేశం కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం డైలాగులు తక్కువ అవ్వడమే. సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్దుల్ వాహెబ్ పాటలు & నేపథ్య సంగీతం బావున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నారు.
చిరుజల్లు పడినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో... 'మనమే'లో వినోదం, హీరో శర్వానంద్ నటన చూస్తున్నంత సేపూ అటువంటి ఆహ్లాదం కలుగుతుంది. ఫన్ వర్కవుట్ అయినట్టు ఎమోషన్స్ వర్కవుట్ అవ్వవు. ఎక్కువ ఆశించకుండా, మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే... చక్కని హాస్యం, అందమైన విజువల్స్, మంచి మ్యూజిక్ - ఫ్యామిలీ అందరితో చూడదగ్గ చిత్రమిది. శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య మధ్య సన్నివేశాలు బావున్నాయి.