Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Andhra News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో ఇష్టాగోష్టి సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇకపై ప్రజల మధ్యే ఉంటానని.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.
Pawan Kalyan Interesting Comments In Media Chit Chat: ఇకపై నెలలో 14 రోజులు ప్రజల మధ్యే ఉంటానని.. అందుకు అనుగుణంగా జిల్లా పర్యటనలు ఉంటాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawankalyan) తెలిపారు. సోమవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో పలు ఆసక్తికర విషయాలపై ఆయన స్పందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తాను చెప్పులు వేసుకుని నడుస్తుంటే బురదలో ఇరుక్కుపోయాయని.. అవి వదిలేసి నడిచానని ప్రతీ నాయకుడికి ఈ అనుభవం అవసరమని అన్నారు. 'నేను నడిచి చూపిస్తేనే ఇతరులకు ధైర్యం వస్తుంది. నా పేషీతో వెళ్లి జిల్లాల్లో కూర్చోవడం అవసరం. నేనేదో పని మీద వెళ్లినప్పుడు చూడడం కాకుండా, అక్కడే క్యాంప్ ఆఫీస్ పెడితే ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపగలం. నెలలో 14 రోజులు జిల్లా పర్యటనలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అయితే అది ఒక జిల్లానా.? రెండా.? అనేది చూడాల్సి ఉంది. ఆహార వసతులు, సెక్యూరిటీ, బస అన్నీ కూడా చూసుకోవాలి.' అని పవన్ పేర్కొన్నారు.
'అలా చేస్తే సెలవు బాగుంటుంది'
అధికార యంత్రాంగంలో నిర్లక్ష్యం వీడేలా అన్నీ సరిచేస్తానని పవన్ తెలిపారు. 'అధికార వ్యవస్థలో స్పందన కరువైంది. ఇటీవల కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. అందులో ఓ యువకుడు బ్రెయిన్ డెడ్ అయితే, అతని అవయవాలను పేరెంట్స్ దానం చేశారు. ప్రమాదంపై కేసు ఫైల్ చేయమంటే పోలీస్ అధికారులు సరిగ్గా స్పందించలేదు. ఈ విషయం నా దృష్టికి రాగానే ఎస్పీతో మాట్లాడాలని చెప్పాను. మానవతా దృక్పథం లేకపోతే ఎందుకు.?. ఇలాంటి విషయాల్లో సమూల మార్పు తీసుకురావాలి. కొన్ని సమస్యల పరిష్కారం కోసం సీఎంగారు అధికారులతో 14 గంటలు మీటింగ్ పెడతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అధికారులు సక్రమంగా పనిచేయాలి. అధికార వ్యవస్థలో సమయపాలన సరిగ్గా లేదు.
గత ఐదేళ్లలో నాణ్యత పరిశీలన లేకపోవడంతో ఇప్పుడది అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటు మాన్పించాలంటే మాకు టైం పడుతుంది. ఈ క్రమంలో అధికారులు కొంత ఇబ్బందులు పడొచ్చు. శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకోవాలంటే మిగిలిన రోజులు బాగా పనిచేయాలి. 5 రోజులు బలంగా పని చేస్తే సెలవు కూడా బాగుంటుంది. అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేయడమే జిల్లాల పర్యటన ఉద్దేశం.' అని పవన్ స్పష్టం చేశారు.
అది నిర్మూలించాలి
గత ప్రభుత్వ హయాంలో లంచాలు లేకుండా బదిలీలు జరగలేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరిట్ ఆధారంగా పోస్టులు ఇచ్చామని పవన్ గుర్తు చేశారు. తన పరిధిలో ఉండే అధికారులను చాలా స్పష్టతతో కేవలం మెరిట్ ఆధారంగా నియమించినట్లు చెప్పారు. 'లంచాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. అవినీతి, లంచగొండితనం చాలామందిలో జీర్ణించుకుపోయాయి. వీటిని ఎలాగైనా నిర్మూలించాలి. గతంలో అధికార వ్యవస్థను చిందరవందర చేశారు. మా ఆర్నెళ్ల పాలన వారి ఆర్నెళ్ల పాలన పోల్చండి. ప్రతి నెలా జీతాలు, పెన్షన్లు సమయానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సివిల్ సప్లయ్‌లో కుంభకోణాలు బయటపెట్టాం. అన్ని వ్యవస్థలను గాడిన పెడుతున్నాం.' అని పేర్కొన్నారు.