Telangana News: మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
తెలంగాణ శాసససభ మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపింది. మాజీ ప్రధానికి భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
Former PM Manmohan Singh | హైదరాబాద్: భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేశారు. కేంద్రానికి ఆ ప్రతిపాదనలు పంపనున్నారు. ఆర్థిక సంస్కరలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ దశ దిశను మార్చింది. మన్మోహన్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నేటికి పాటిస్తున్నాం. నేడు దివంగత ప్రధానికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఇదివరకే మన్మోహన్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి అమలు చేస్తోంది. సంతాప దినాలలోనే మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపి, శాసనసభ వేదికగా ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.
ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టాలు మన్మోహన్ ఘనతే. దేశ గొప్ప తత్వవేత్తను కోల్పోయింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్థికవేత్త, మానవతావాది మన్మోహన్ సింగ్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా విశేష సేవలు అందించారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించారు. ఐటీలో నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందంటే అందుకు మన్మోహన్ నిర్ణయాలే కారణం.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితం అని భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సభలో ప్రతిపాదన చేసింది. మన్మోహన్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను కోరారు.
సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. ఎన్ని విమర్శలు వచ్చినా తన సహనాన్ని కోల్పోలేదు. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే మన్మోహన్ ఫోకస్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు ఎంపీగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారు. జీవిత కాలం మాకు గుర్తుండిపోయే సంఘటన అది. 2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి లేని పేదలకు మేలు చేశారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించారు.