జుట్టు రాలుతోందా? మీరు వాడుతున్న ఈ మందులు కూడా కారణం కావచ్చు
జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి. ఒక్కోసారి మీరు వాడే మందులు కూడా కారణం కావచ్చు. అవేంటో చూడండి.
కురులను సిరులతో పోలుస్తారు. జుట్టు రాలిపోతోందని బెంగపడి డిప్రెస్ అయ్యేవారు కూడా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. జుట్టు ఎంత ముఖ్యమైందో. అమెరికన్ డెర్మటాలజీ అసోసియేషన్ రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమే అని అంటోంది. అంతకు మించి జుట్టు రాలితే మాత్రం తప్పకుండా జాగ్రత్త అవసరం. కొన్ని సార్లు మనం వాడుతున్న మందుల వల్ల కూడా జుట్టు రాలే సమస్య మొదలు కావచ్చు. ఈ మందులు స్కాల్ప్ మీద వెంట్రుకలు పెరిగే సైకిల్ మీద కూడా ప్రభావం చూపుతాయి.
బీటా బ్లాకర్స్
బీటాబ్లాకర్స్ మామూలుగా బీపీ వంటి గుండె సమస్యల్లో వాడే మందులు. ఈ మందుల్లో ప్రొప్రనాల్ (Inderal), అటెనాల్ (Tenormin), బైసోప్రొలోల్ (Zebeta), మెటా ప్రొలోల్ (Lopressor) ముఖ్యమైనవి. బీటా బ్లాకర్స్ వాడేవారిలో సాధారణంగా నీరసం, కళ్లు తిరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. కానీ ఇంకోక సాధారణ సైడ్ ఎఫెక్ట్ జుట్టు రాలడం కూడా. బీటా బ్లాకర్స్ స్ట్రెస్ హర్మోన్లకు శరీరం స్సందించే తీరు మీద ప్రభావం చూపిస్తాయి. అడ్రినలిన్ హార్ట్ రేట్ తగ్గించి బీపి పెరగకుండా నియంత్రిస్తుంది. ఈ రకమైన ప్రభావం వల్ల ఫాలికిల్ నుంచి జుట్టు పెరగకుండా నిరోధిస్తుందని నిపుణులు అంటున్నారు. అదృష్టవశాత్తు ప్రొప్రనాల్ వంటి బీటా బ్లాకర్స్ వల్ల కలిగే నష్టం శాశ్వతమైంది కాదు. మందులు మానేసిన వెంటనే జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది.
మూర్ఛకు వాడే మందులు
మూర్ఛ వ్యాధికి వాడే మందుల వల్ల కూడా జుట్టు రాలుతుంది. అందుకు కారణం వారిలో ఏర్పడే పోషకాల లోపం వల్లనే. అయితే దీనిని నివారించేందుకు మల్టీవిటమిన్ టాబ్లెట్లు, బి విటమిన్ ఎక్కువగా ఉండే టాబ్లెట్లు వాడితే ఫలితం ఉండొచ్చు అని నిపుణులు సలహా ఇస్తున్నారు. దాదాపు 127 అధ్యయనాల్లో జుట్టు ఊడిపోవడం, మొటిమలు వంటి సమస్యలు మూర్ఛ మందుల వాడకంలో సైడ్ ఎఫెక్ట్స్ గా కనిపించాయట.
నాస్ట్రయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs)
ఆర్థరైటిస్ వంటి కొన్ని దీర్ఘకాలిక నొప్పుల కోసం వాడే మందులు, ఆస్ప్రిన్, ఐబుప్రొఫిన్ వంటి మందులను సాధారణంగా ఓవర్ కౌంటర్ వాడేస్తుంటారు. కానీ చాలావరకు NSAIDs కోసం ప్రిస్క్రిప్షన్ అవసరం ఉంటుంది. వీటి లో రకరకాల మందులు ఉంటాయి వీటి వల్ల సాధారణంగా కడుపులో బాలేకపోవడం, బీపీ పెరగడం, కిడ్నీసమస్యల వంటి సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. జుట్టు రాలడం అనేది వీటి వల్ల కలిగే అతి చిన్న దుఫ్ప్రభావంగా చెప్పుకోవచ్చు. వీటి వల్ల ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కనుక వీటిని వీలైనంత తక్కువగా వాడడం మంచిది. అది కూడా డాక్టర్ సలహా మేరకే వాడాలి.
యాంటి డిప్రెసెంట్స్
యాంటి డిప్రెసెంట్ మందుల వల్ల జుట్టు ఎందుకు రాలుతుందో కారణాలు ఇంకా తెలియలేదు. బూప్రోపియాన్ వల్ల చాలా మందిలో జుట్టురాలినట్టు గుర్తించారు. పారాక్సిటిన్ వల్ల కాస్త తక్కువ జుట్టు రాలుతోందట. ఒకవేళ జుట్టు ఎక్కువగా రాలుతున్నట్ట అనిపిస్తే మందులు మార్చుకోవడం మంచిది. ఇంటర్నల్ సైకోఫార్మకాలజీ అనే జర్నల్ లో 2018లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ దాదాపు ప్రతి యాంటి డిప్రెసెంట్ డ్రగ్ వల్ల జుట్టు రాలుతుందనే తెలిపింది. అయితే ఇది శాశ్వతం కాదు మందులు ఆపేసిన తర్వాత సమస్య కూడా ఆగిపోతుంది. ఒక వేళ ఎక్కువ జుట్టు రాలుతోందని అనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
నిజానికి విటమిన్ డిఫిషియెన్సీ వల్ల జుట్టు రాలుతుంది. జింక్, బయోటిన్, విటమిన్ డి సరిపడినంత లేనపుడు జుట్టు రాలడం మొదలవుతుంది. ఈ మూడు పోషకాలు కలిగిన మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడడం వల్ల ఫలితం ఉండొచ్చు. ఒమెగా -3, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.