Beer: ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లు తాగొచ్చా? రోజూ తాగితే ఏమవుతుంది?
వేసవి వచ్చిదంటే బీర్ అమ్మకాలు పెరుగుతాయి. ఎండల వేడిలో చల్లటి బీర్‌ను చాలా మంది తాగేస్తారు.
వేసవి తాపం మొదలైపోయింది.ప్రజలు చల్లని పానీయాల వెంట పరుగులు మొదలుపెట్టేశారు. వేసవిలో తాగే పానీయాల జాబితాలో బీరు కూడా ఒకటి. చల్లని బీరు తాగితే శరీరం చల్లబడుతుందని అనుకుంటారు చాలా మంది. ఇది ఎంతవరకు నిజం? వేసవి తాపాన్ని బీరు తగ్గిస్తుందా?
ఆ బీరు బెటర్
వాతావరణం వేడెక్కిన వేళ చల్లని బీరు తాగితే నాలికకు హాయిగా ఉండడం ఖాయం. కానీ నిజానికి నీళ్లకు మించిన దివ్యౌషధం మాత్రం బీరు కాదు. ఆల్కహాల్ ఉన్న బీరు తాగడం వల్ల వేసవిలో ఇంకా సమస్య పెరుగుతుంది. దాహం అధికమవుతుంది. శరీరం నీటిని అధికంగా కోల్పోతుంది. అదే ఆల్కహాల్ లేని బీర్ వల్ల మాత్రం మంచి ప్రయోజనాలే ఉన్నాయి. వేసవిలో తాగాలనిపిస్తే ఆల్కహాల్ లేని బీర్ తాగాలి. అది కూడా వారానికి ఒకటి నుంచి మూడు సార్ల వరకు తాగొచ్చు. ఇలా మితంగా తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అదే అధికంగా తాగితే మాత్రం బరువు త్వరగా పెరగడం, కాలేయం దెబ్బతినడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
మితంగా తాగితే...
బీర్ ను వారానికి మూడు సార్లకు మించి తాగకూడదు. ఇలా మితంగా తాగితే శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేస్తుంది. చర్మాన్ని శుద్ది చేసి మెరుపును అందిస్తుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. గతంలో 70,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఆల్కహాల్ లేని బీర్ అప్పుడప్పుడు తాగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం తగ్గినట్టు గుర్తించారు పరిశోధకులు. బీర్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. అలాగే ప్రొటీన్, విటమిన్ బి కూడా దొరుకుతాయి. అందుకే బీర్ మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. బీరులో లభించే సిలికాన్ ఎముకలను బలోపేతం చేస్తుంది. బీరు తాగడం వల్ల దంత క్షయం, ఇన్పెక్షన్లు రావు. కాబట్టి ఆల్కహాలిక్ లేని బీరును అప్పుడప్పుడు తాగితే మంచిదే.
ఎలా తయారుచేస్తారంటే..
ఒక ఆహారాన్ని తయారుచేసే పద్ధతిలోనే అదిచ్చే ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. బీర్‌ను బార్లీ లేదా గోధుమ గింజలు, కొన్ని రకాల మసాలాలు, ఈస్ట్, నీళ్లు కలిపి తయారుచేస్తారు. అయిదు దశల్లో బీరును సిద్ధం చేస్తారు. మొదట బార్లీ, లేదా గోధుమలను మొలకెత్తిస్తారు. తరువాత మాషింగ్ పద్ధతిలో లిక్విడ్ గా మారుస్తారు. ఆ లిక్విడ్‌ను బాగా మరగబెట్టి ప్రత్యేక మసాలాలు కలుపుతారు. నిల్వ ఉంచేందుకు ఫెర్మెంటేషన్ పద్ధతిలో ఈస్ట్ అనే బ్యాక్టిరియాను కలుపుతారు. అందుకే బీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.