Ragi Dosa: ఇలా రాగిదోశ చేస్తే వదిలిపెట్టకుండా తినేస్తారు, అధిక బరువు నుంచి మధుమేహం వరకు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు
రాగి దోశ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఆరోగ్యకరమైనది.
బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలన్నది రోజూ మహిళల ముందున్న పెద్ద ప్రశ్న. ఆరోగ్యంతో పాటూ రుచిగా ఉండే వాటినే ఎంచుకుంటారు. ఒకసారి రాగి దోశెను చేసుకుని తింటే తెలుస్తుంది ఎంత రుచో. మాకు రాదా రాగి దోశ చేయడం, రాగి పిండిలో నీళ్లేసి, ఉప్పు కలిపి దోశెలా పోసెయ్యడమే కదా అనుకుంటారు చాలా మంది. కానీ దీన్ని చేయాల్సిన పద్ధతిలో చేస్తే ఆ రుచే వేరు. ఎలా చేయాలో ఓసారి చూడండి.
కావాల్సిన పదార్థాలు
రాగి పిండి – ఒక కప్పు
పెరుగు – అరకప్పు
బియ్యం పిండి – అర కప్పు
బొంబాయి రవ్వ – ఒక కప్పు
కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు– పావు కప్పు
జీలకర్ర – ఒక టీ స్పూన్
అల్లం – ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూన్
మిరియాల పొడి – సగం టీ స్పూన్
ఉప్పు – తగినంత
నీళ్లు – సరిపడా
తయారీ ఇలా...
1. ఇక గిన్నెలో రాగిపిండి, బొంబాయి రవ్వ, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి.
2. ఆ పిండిలో నీళ్లు పోసి బాగా కలపాలి.
3. మిగతా పదార్థాల తరుగులన్నీ వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
4. పిండి గట్టిగా కాకుండా దోశెలు వేసేందుకు వీలుగా జారుతున్నట్టు కలుపుకోవాలి.
5. ఓ పావు గంటసేపు అలా వదిలేయాలి. తరువాత అవసరం అయితే నీళ్లు కలుపుకోవాలి.
6. పెనం వేడెక్కాక పలుచటి దోశలా పోసుకోవాలి.
7. ఈ దోశెలను చట్నీ లేకుండా తిన్నా కూడా టేస్టీగానే ఉంటాయి. పుదీన చట్నీతో తింటే ఇంకా రుచిగా అనిపిస్తాయి.
ఎన్ని ప్రయోజనాలో...
రాగులు సిరిధాన్యాల్లో ఒకటి . వీటిని తినమని వైద్యులు కూడా ప్రత్యేకంగా చెబుతారు. బరువు తగ్గాలనుకునేవారికి రాగి దోశ చాలా మేలు చేస్తుంది. అలాగే మధుమేహులు కూడా రాగి దోశెలను తినవచ్చు. బియ్యంపిండి కలిపామని దూరం పెట్టక్కర్లేదు. దాని వల్ల పెద్ద నష్టం జరుగదలు. రాగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి కాబట్టి భయపడకుండా తినవచ్చు. ఈ దోశెలో లభించే పోషకాలు కూడా అధికమే. పచ్చిమిర్చి తరుగు తగ్గించి పిల్లలకు తినిపిస్తే మంచిది. వారంలో కనీసం రెండు సార్లు ఈ రాగి దోశ తినడానికి ప్రయత్నిస్తే ఆరోగ్యం.
Also read: లైంగిక అంటువ్యాధులు ఎన్నో, ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు
Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు