Best Sci Fi Movies On OTT: మనుషులంతా జంతువులుగా మారిపోతే? వామ్మో, ఈ మూవీ మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది - ఒళ్లు గగూర్పాటు కలిగించే స్టోరీ
Movie Suggestions: మనిషి.. తిరిగి జంతువులాగా మారే అవకాశమే లేదు. కానీ ఒకవేళ అలా జరిగితే ఇలాగే ఉంటుందేమో అని చూపించే మూవీనే ‘యానిమల్ కింగ్డమ్’. ఇదొక సైన్స్ ఫిక్షన్ కథే అయినా ఇందులో ఎమోషన్స్ కూడా ఉంటాయి.
Sci Fi Movie Suggestions: కోతి రూపాంతరం చెంది మనిషిగా మారిందని అంటుంటారు. ఒకవేళ అదే మనిషి.. మళ్లీ మృగంగా మారితే ఎలా ఉంటుంది..? అలాంటి మార్పు ఒక వ్యాధిగా మారి అందరికీ వ్యాప్తిస్తూ ఉంటే ఎలా ఉంటుంది..? తాము మనుషులం అని మర్చిపోయి వింత జీవులగా మారినవారంతా ఇతర మనుషులపై దాడిచేస్తూ ఉంటే ఎలా ఉంటుంది..? అలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ కథను కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమానే ‘ది యానిమల్ కింగ్డమ్’. ఇలాంటి కథతో పలు ఇంటర్నేషనల్ సినిమాలు వచ్చినా అందులో ‘ది యానిమల్ కింగ్డమ్’ (The Animal Kingdom) కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఇందులో మనుషులు జంతువులుగా మారినా సరే.. వారి మధ్య ఎమోషన్స్ అలాగే ఉండిపోతాయిని చూపించాడు దర్శకుడు థామస్ కెయిలే.
‘లా రెగ్నే యానిమల్’ అనే ఫ్రెంచ్ సినిమానే ‘ది యానిమల్ కింగ్డమ్’ పేరుతో ఇంగ్లీష్‌లో విడుదలయ్యింది. 2023లో విడుదలయిన ఈ మూవీకి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్థానం కూడా దక్కించుకుంది. దానికి ముఖ్య కారణం ఇందులో ఉన్న ఎమోషన్సే. ఇది ఒక తండ్రీ, కొడుకుల కథ. కొడుకుని కాపాడడం కోసం, తనను సంతోషంగా ఉంచడం కోసం త్యాగం చేసిన తండ్రి కథ.
కథ విషయానికొస్తే..
ఫ్రాన్స్‌కో (రొమైన్ డ్యూరిస్), తన కొడుకు జాన్ (పాల్ కిర్చర్)కు మధ్య రిలేషన్ అంతగా బాగుండదు. వారిద్దరూ ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. అలా ట్రాఫిక్స్‌లో ఇరుక్కుపోయిన ఫ్రాన్స్‌కో, జాన్ గొడవపడడంతో ‘ది యానిమల్ కింగ్డమ్’ మొదలవుతుంది. తండ్రిపై కోపం తెచ్చుకొని జాన్.. కారు దిగి వెళ్లిపోతుంటాడు. అప్పుడే ఆ ట్రాఫిక్‌లో ఉన్న ఒక ఆంబులెన్స్ నుండి ఓ మనిషి వింత ఆకారంతో బయటికి దూకుతాడు. అది మనిషా, జంతువా అనేది చూస్తున్న ఫ్రాన్స్‌కో, జాన్‌లకు అర్థం కాదు. పోలీసులు ఆ వింత మనిషిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినా అతడు దొరకకుండా అడవిలోకి పారిపోతాడు. అప్పటికే ఆ ప్రాంతంలోని చాలామంది మనుషులు.. జంతువుల్లాగా మారిపోతుంటారు. వారంతా అడవిలోనే జీవిస్తుంటారు. అందులో ఫ్రాన్స్‌కో భార్య, జాన్ తల్లి కూడా ఒకరు.
మనుషుల నుండి జంతువుల్లాగా మారిపోతున్న వారిని ప్రభుత్వం.. ఓ హెల్త్ కేర్ సెంటర్‌లో బంధిస్తుంది. అదే సమయంలో జాన్ కూడా జంతువులాగా మారిపోతున్నట్టు తెలుసుకుంటాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ఉంచాలని అనుకుంటాడు. తెలిస్తే తనను కూడా హెల్త్ కేర్ సెంటర్‌లో బంధిస్తారని అడవిలోకి పారిపోతాడు. అదే సమయంలో తన తల్లిని కలుస్తాడు. కానీ పోలీసులు అడవిలో ఉన్న జాన్‌ను పట్టుకొని తన తండ్రికి అప్పగిస్తారు. ఆ సమయంలో జాన్.. జంతువులాగా మారాడని పోలీసులు గమనిస్తారు. వెంటపడి అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొడుకు కోసం, తల్లీకొడుకులను కలపడం కోసం ఫ్రాన్స్‌కో.. జాన్‌ను తిరిగి అడవిలోనే వదిలేస్తాడు.
ఎక్కడ చూడొచ్చంటే..
‘ది యానిమల్ కింగ్డమ్’ ఒక సింపుల్ సినిమా. కానీ అందులో మనుషుల నుండి జంతువులుగా రూపాంతరం చెందుతున్న విజువల్స్‌ను చాలా నేచురల్‌గా చూపించారు మేకర్స్. జంతువుల్లాగా మారిన వారు మనుషులపై దాడి చేసినా కూడా తోటి జంతువులకు హాని కలిగించకుండా ఉండడం ఎమోషన్స్‌కు ప్లస్ అయ్యింది. కథ గురించి ఎంత చెప్పినా ‘ది యానిమల్ కింగ్డమ్’ను నేరుగా చూస్తే ఆ విజువల్ ట్రీట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అక్కడక్కడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నా విజువల్స్ విషయంలో మేకర్స్‌కు వంద మార్కులు వేయాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ మూబీ (Mubi) అనే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో అందుబాటులో ఉంది.