Free Health Insurance Scheme In AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వారం పదిరోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనుంది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలు చేసేందుకు సిద్ధపడింది. ఆరోగ్య శ్రీతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకం అమలుకు ప్రభుత్వం ప్రక్రియ చేపట్టబోతోంది. దీనికి ముందు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. అందులో తక్కువకు కోట్ చేసిన వాళ్లకు ఈ టెండర్లు ఇవ్వనుంది. ప్రస్తుతం ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ ద్వారా సేవలు అందుతున్నాయి. ఇప్పుడు బీమా పథకం అమలులోకి వస్తే దాదాపు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య సేవలు లభించనున్నాయి.
రాష్ట్రంలో ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు విషయమై చర్చించేందుకు వారం పది రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో నిర్ణయం తీససుకోనున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా చేసి టెండర్లు పిలవబోతున్నారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ వరకు రెండో యూనిట్‌గా తీసుకుంటున్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ప్రతిపాదించిన అంశాల్లో మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. అనంతరం టెండర్లు పిలవడం జరిగిపోతుంది. దీంతో పథకం అమలు ఏప్రిల్ లేదా మే నుంచి స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి పాతిక లక్షల విలువై సేవలు ఆరోగ్య శ్రీ ద్వారా లభిస్తున్నాయి. ఇప్పుడు తీసుకురాబోతున్న ఆరోగ్య బీమా పథకం ద్వారా పరిమితులు, షరతులు లేకుండా అందరికీ సేవలు అందుతాయి.
ఉచిత ఆరోగ్య బీమా పథకం వస్తే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ప్రచారం కూడా ఉంది. దీన్ని ప్రభుత్వ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆరోగ్య శ్రీ కొనసాగిస్తూనే ఉచిత బీమా పథకం కూడా అమలులోకి వస్తుందని చెబుతున్నారు. రెండున్నర లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ద్వారా సేవలు అందిస్తారు. ఆపై ఖర్చు అయితే ఆరోగ్య శ్రీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా రెండున్నర లక్షల లోపు వైద్య ఖర్చులు పెట్టే వారి సంఖ్య 90శాతానికిపైగా ఉంటోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
Also Read: విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
సేవల్లో జాప్యం లేకుండా ఉండేందుకు బీమా సంస్థలకు ముందే మూడు నెలలకోసారి నగదు చెల్లించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇలా చేయడం వల్ల త్వరగా సేవలు అందుతాయని భావిస్తున్నారు. అంతే కాకుండా ఒకసారి ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీస్ అందిస్తుంది. ఇప్పుడు ఆరోగ్య శ్రీ ద్వారా రోగి చికిత్సకు అనుమతి కోసం 24 గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఉచిత బీమా పథకం అమలులోకి వస్తే ఆరు గంటల్లోనే ప్రక్రియ పూర్తి కానుంది. ఒక వేళ చికిత్సకు బీమా సంస్థలు నిరాకరిస్తే రివ్యూకి కూడ వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇందులో ఫైనల్ నిర్ణయం ప్రభుత్వానిదే అవుతుంది.
దీనికి ప్రస్తుత ధరల ప్రకారం 2500 రూపాయల ప్రీమియం ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఉచిత బీమా సౌకర్యం చాలా రాష్ట్రాల్లో అమలులో ఉంది. అయితే డబ్లూహెచ్‌వో అధ్యయన ఫలితాలు ఆధారంగా ఏది ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం తీసుకుంటోంది. ఇందులో ప్రజలకు, బీమా సంస్థలకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రావని భావిస్తున్నారు.
Also Read: మిర్చి ధరల పతనంపై చంద్రబాబు క్లారిటీ- కేంద్రం దృష్టికి రైతుల కష్టాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

