India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?
బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ నుంచి మరో రియల్ లైఫ్ స్టోరీ 'ఇండియా లాక్ డౌన్'. వేశ్య పాత్రలో శ్వేతా బసు ప్రసాద్, కూలీ పాత్రలో ప్రతీక్ బబ్బర్, ఇతర పాత్రల్లో ప్రకాశ్ బేలవాడి, అహనా కుమ్రా నటించారు.
మీకు లాక్ డౌన్ కష్టాలు గుర్తున్నాయా? కొవిడ్ అందరి జీవితాలను తలకిందులు చేసింది. బయటకు వెళ్లే వీలు లేకుండా ఇళ్లకే పరిమితమైపోయి బతికిన మనుషులు... నెలల పాటు ఊరు కాని ఊరిలో తిండి కోసం అవస్థలు పడిన పేద ప్రజలు... వందల కిలోమీటర్లు చంటి బిడ్డలను చంకన మోసుకుంటూ కాలినడకన రాష్ట్రాలు దాటిన వలస కూలీలు... కళ్ల ముందు తిరిగిన మనుషులంతా కాలం చేస్తుంటే ఏం చేయాలో తెలియక బిక్క చచ్చిపోయాం. అటువంటి దుస్థితిని, కల్లోలాన్ని మరోసారి జీవితంలో అనుభవించాలని ఎవరూ కోరుకోరు. నాటి ఘటనలు మర్చిపోయిన, మర్చిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 'జీ 5'లో ఈ రోజు విడుదలైన 'ఇండియా లాక్ డౌన్ ' సినిమా చూడండి. మీకు తెలియకుండా మీ కళ్ల వెంట నీళ్లు తిరుగుతాయి.
సినిమానా? నిజ జీవిత ఘటనలా?
మధుర్ భండార్కర్... హ్యూమన్ లైఫ్ లో డార్క్ సైడ్స్ ను చాలా నేచురల్ గా స్క్రీన్ ప్రజెంట్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్. 'చాందినీ బార్' నుంచి 'పేజ్ 3', 'ట్రాఫిక్ సిగ్నల్', 'హీరోయిన్', 'ఫ్యాషన్' ఏ సినిమా అయినా గ్రౌండ్ రియాల్టీతో కనెక్ట్ చేసి చూపిస్తారు. సినిమా చూస్తున్న ఫీలింగ్ పోయి... ఏదో పక్కన మనతోనే రోజూ ఉంటున్న మనుషుల జీవితాలను అతి దగ్గరి నుంచి చూసినట్లు అనిపించేలా ఉంటుంది ఆయన నేచురల్ టేకింగ్. ఇప్పుడు 'ఇండియా లాక్ డౌన్' సినిమాతోనూ ఆయన అదే మ్యాజిక్ చేశారు. ఈ సినిమా చూస్తుంటే మళ్లీ లాక్‌డౌన్‌లో ఉన్నామా? అనే ఫీల్ మనకు కలుగుతుంది.
కథ ఏంటంటే? : 'ఇండియా లాక్‌డౌన్' మనందరి కథ. మనతో బతికిన, బతుకుతున్న వాళ్ల కథ. ఓ వేశ్య కథ, ఓ సగటు తండ్రి కథ, ఓ ఉద్యోగం చేసుకునే మహిళ కథ, కాయకష్టం చేసుకుని బతికే ఓ కూలి కథ. వీళ్లందరూ లాక్ డౌన్ టైమ్ లో ఎలా సమస్యల వలయంలో చిక్కుకుపోయారని చూపిస్తూనే మన కష్టాలను మళ్లీ మనకు చూపించారు మధుర్ బండార్కర్. మాస్క్ మీద ఎలాంటి పుకార్లు సృష్టించారు? లాక్ డౌన్ రూల్స్ ఎలా బ్రేక్ చేశారు? కొంత మంది అధికారుల అతి చేష్ఠలు, సాధారణ జనాల భయాలు, తిండి కోసం తిప్పలు... సినిమాలో మ్యాగ్జిమం అన్నీ టచ్ చేశారు.
నటీనటుల విషయానికి వస్తే... మనకు 'కొత్త బంగారులోకం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ 'ఇండియా లాక్‌డౌన్'లో మెహరున్నీసా అనే వేశ్య పాత్రలో నటించారు. సినిమాలో ఎక్కువ కథ, ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆమెకే దక్కింది. ఆ పాత్రలో అద్భుతంగా చేశారు. లాక్‌డౌన్ టైమ్ లో మిగిలిన వాళ్లకు బతకటానికి ఏదో ఒక ఆధారం ఉంది కానీ... పూర్తిగా వేశ్య వృత్తిలో జీవితం గడిపిన వాళ్ల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఆ సన్నివేశాలను శ్వేతా బసు తన నటనతో అద్భుతంగా చూపించారు. అహనా కుమ్రా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మూన్ ఆల్వ్స్ అనే పైలెట్ రోల్ లో తాను పడిన కష్టాలను చూపించారు. ప్రతీక్ బబ్బర్ గురించి చెప్పుకోవాలి. కూలీ పనివాడిగా ప్రతీక్ బబ్బర్, ఆయన వైఫ్ పాత్రలో సాయి తమ్హంకర్ యాక్టింగ్ మన కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది. 'కశ్మీర్ ఫైల్స్'తో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ యాక్టర్ ప్రకాశ్ బేలవాడి... నాగేశ్వరరావు అనే తెలుగు వ్యక్తి పాత్రలో నటించారు. తన కుమార్తె ప్రెగ్నెంట్ అయితే ఆ చివరి నిమిషాల్లో ఆమెను చేరుకోవడం కోసం తండ్రిగా ప్రకాశ్ పడే తపన కళ్ల నీళ్లు తెప్పిస్తుంది.
Also Read : 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?
మొత్తంగా లాక్ డౌన్ ఈ తరం లో మన జీవితాలను ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన ఘటనల్లో ఒకటి. చాలామందికి జీవితాంతం మర్చిపోలేని బాధలను మిగిల్చింది. చాలా మందికి జీవితంలో మనం ఎంత క్రమశిక్షణ ఉండాలో నేర్పించింది. మరికొంత మందికి ఈ జీవితంలోని ప్రతీక్షణాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పిందో. ఇలా ప్రతీ ఒక్కరి జీవితాలను ఇంపాక్ట్ చేసిన సినిమా 'ఇండియా లాక్ డౌన్'.